ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని తీసుకొచ్చిన పథకం రేషన్ డోర్ డెలివరీ. అయితే, విశాఖలో ఇంటింటికీ రేషన్ పంపిణీ ప్రక్రియకు రెండో రోజే బ్రేక్ పడింది. మేము మూటలు మోయలేమంటూ డోర్ డెలివరీ వాహనాలతో ఆయా డ్రైవర్ కమ్ యజమానులు సీతమ్మధార అర్బన్ తహసీల్దార్ వద్ద ఆందోళనకు దిగారు. ఓవైపు డ్రైవింగ్, మరో వైపు మూటలు మోయడం, కొలతలు వేయడం, డబ్బులు వసూలు చేసి తిరిగి డీలర్లకు చెల్లించడం వంటి పనులన్నింటినీ, ఒక్కరమే ఎలా చేయగలమని తహసీల్దార్ జ్ఞానవేణిని ప్రశ్నించారు.
బియ్య మూటలు మోసేందుకు కలాసీ ని ఇవ్వాలని, పనిచేయని తూనికల మిషన్లను సరిచేయాలని వాహనాల డిమాండ్ చేశారు. తూనికల మిషన్ చార్జింగ్ పది కార్డులు నమోదు చేసేసరికి అయిపోతోందని, దీంతో కార్డుదారులతో రేషన్ డీలర్లు ఫోన్‌లు చేయిస్తున్నారని ఆరోపించారు. కొందరు కందిపప్పు, బియ్యం వద్దంటున్నారని, కానీ వారికి కూడా ఇచ్చినట్లు డీలర్లు నమోదు చేయాలంటున్నారని అన్నారు. డ్రైవర్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తహసీల్దార్ జ్ఞానవేణి తెలిపారు.
కాగా తమ కంటే కూలీయే బెస్ట్ అంటూ డ్రైవర్లు కొంతమంది వాపోయారు. కూలికి వెళ్తే రోజుకి రూ.500చొప్పున నెలకు రూ.15,000 వ స్తుందన్నారు. భవిష్యత్తు ఉంటుందని ప్రైవేటు ఉద్యోగాలు మానుకుని, రూ.10 వేల జీతానికి వచ్చి.. ఒక్కరం అన్ని పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, తమ సమస్యలపై కచ్చితమైన హామీ ఇచ్చేవరకు సరుకులను తీసుకుని వెళ్లేది తేల్చిచెప్పారు.