ప్ర‌భుత్వానికి త‌లైవా స్ట్రాంగ్ వార్నింగ్

త‌మిళ తంబీల కోసం త‌లైవా ఎమోష‌న‌ల్ వీడియో

మ‌ద్యం దుకాణాలు తెర‌వడానికి సిద్ధ‌మ‌వుతున్న త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి సౌత్ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు రజనీకాంత్ స్ట్రాంగ్ కౌంట‌ర్ వేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆదివారం నాడు అధికార ఎఐఎడిఎంకె ప్రభుత్వానికి ఆయన వార్నింగ్ ఇచ్చారు. మద్యం దుకాణాలను తెరిస్తే తిరిగి అధికారంలోకి రావాలని కలలుకంటున్న వారి ప‌ప్పులు ఉడ‌క‌వ‌ని హెచ్చరించారు.

ఓవైపు త‌మిళ‌నాడులో క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతోంది. అంత‌కంత‌కు మ‌హమ్మారీ చాప చుట్టేస్తోంది. చెన్న‌య్ స‌హా అన్ని న‌గ‌రాల్లో మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తోంది. ఇలాంటి క్లిష్ఠ‌ సమయంలో మద్యం షాపులు తెరిస్తే తిరిగి అధికారంలోకి రావాలనే కలను ప్రభుత్వం మరచిపోవాలని రజనీకాంత్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఖ‌జానా నింపేందుకు ప్ర‌భుత్వం ఇతర మంచి మార్గాలను అన్వేషించాల‌ని ఆయన కోరారు.

మే 7 నుంచి త‌మిళ‌నాడు రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమ‌తించింది. మద్రాస్ హైకోర్టు మొదట్లో షరతులకు లోబడి మద్యం దుకాణాలను తెర‌వొచ్చ‌ని తీర్పునిచ్చింది. అయితే, అవుట్‌లెట్‌లు తెరిచినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు నిర్దేశించిన షరతులను పాటించాల‌ని కోరింది. కానీ ఎవ‌రూ ఆ ఆదేశాల్ని పాటించ‌లేదు. గుంపులుగా వెళ్లి వైన్ షాపుల‌పై ప‌డ్డారు. ఆ క్ర‌మంలోనే విశ్వ‌న‌టుడు నాయ‌కుడు కమల్ హాసన్ కి చెందిన `మక్కల్ నీది మయం` (ఎంఎన్ఎం) పార్టీ వైన్ షాపుల యాజ‌మాన్యాల‌ నియ‌మ ఉల్లంఘనను ప్ర‌స్థావిస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

ఆన్‌లైన్ అమ్మకాలు .. మద్యం బాటిళ్లను ఆన్ లైన్ అమ్మ‌కాల్ని ప్రోత్స‌హిస్తూ.. ప్ర‌జ‌ల ఇళ్ల‌కే పంపిణీ చేయడానికి అనుమతించాల‌ని.. అవుట్‌లెట్లను మూసివేయాలని మే 8 న కోర్టు ఆదేశించింది. ఇంతలో మద్రాస్ హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అటు క‌మ‌ల్ హాస‌న్ ఇటు ర‌జ‌నీకాంత్ క‌లిసిక‌ట్టుగా పోరాడుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. మ‌ద్యం షాపులు తెరిస్తే ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ముప్పు రానుందో కోర్టుల్లో వీరి త‌ర‌పు న్యాయ‌వాదులు వినిపించనున్నారు.