ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన బాంబు పేల్చారు. కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీ భారీ ఓటమిని ఎదురు చూసిన తర్వాత… ఆ పార్టీ ఏపీపై మరింత తీవ్ర స్థాయిలో దాడికి తెగబడబోతోందనే వార్తలు తన దాకా వచ్చాయని ఆయన వెల్లడించారు. రానున్న 15 రోజుల్లో టీడీపీ సానుభూతిపరులైన ప్రముఖులు, తెలంగాణ, ఏపీలో టీడీపీకి అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, ఈ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఈడీ, ఐటీ దాడులు జరగబోతున్నట్టు తన వద్ద సమాచారం స్పష్టం చేశారు.
ప్రధాని కార్యాలయంలో ఉన్న ఒక కీలక అధికారి ఈ దాడులను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. దాడులు రేపట్నుంచి 15 రోజుల్లోగా జరగవచ్చని ఆయన తెలిపారు.వీరిలో బెజవాడలో ఉండే ఇద్దరు హోటల్ యజమానులు, బెజవాడ దగ్గరలో ఉన్న పెద్ద యూనివర్శిటీ యజమాని దాడులను ఎదుర్కోబోయే జాబితాలో ఉన్నట్టు తమ్మారెడ్డి వెల్లడించారు.
గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఉన్న టాప్ టీడీపీ నేతలు, మైనింగ్ లో ఉన్న ఒక నేత, ఇసుక వ్యాపారంలో ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు, బయో ఫర్టిలైజర్స్ బిజినెస్ లో ఉన్న ఒక నేత, రియల్ ఎస్టేట్స్ లో ఉన్న మరో నేత, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు, ఉత్తరాంధ్ర, నెల్లూరు జిల్లాలకు చెందిన మరో ఇద్దరు మంత్రులు, గుంటూరు జిల్లాకు చెందిన ఒక సంపన్న ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మరో నేత, పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక బిజినెస్ తో సంబంధం ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక సంపన్న ఎంపీపై దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.
సీఎం రమేష్ పై ఇప్పటికే దాడులు జరిగిన కారణంగా అతనిపై పెద్దగా దాడులు జరగకపోవచ్చని తమ్మారెడ్డి అన్నారు. కానీ, ఏదో ఒకటి చేసి రమేష్ ను కూడా దెబ్బతీస్తారని వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలో టీడీపీకి మద్దతుగా ఉన్న పారిశ్రామికవేత్తలపై దాడులు జరుగుతాయని తెలిపారు. ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తారని, రానున్న ఎన్నికల్లో వీరంతా టీడీపీకి మద్దతు ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితులను కల్పిస్తారని సెన్సేషనల్ విషయాలు వెల్లడించారు.
ఇది ఒక్క ఏపీలో మాత్రమే జరగడం లేదని, ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే విధంగా బీజేపీ అడుగులు వేస్తోందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని దారుణాలు జరిగినా పట్టించుకోవడం లేదని, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కుట్రలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే శబరిమల అంశాన్ని బీజేపీ వివాదాస్పదం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈ విషయాలన్నీ ఆయన టీవీ 5 ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడవచ్చు.