కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ వివక్ష చూపుతుందని మరీ వారి పై ప్రభుత్వ ఒత్తిళ్లు ఉన్నాయోమో చెప్పాల్సిన అవసరముందన్నారు. తాము ఎక్కడ చిన్న తప్పు చేసినా నోటిసులు ఇస్తున్న ఎన్నికల కమిషన్ కేసీఆర్, కేటిఆర్ లు చేస్తున్న తప్పుల పై ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రగతి భవన్ లో రాజకీయ వ్యవహారాలు చేపట్టవద్దని తాము ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తే టిఆర్ఎస్ కు ఎన్నికల సంఘం నోటిసులిచ్చింది. అయినా కూడా ప్రగతి భవన్ లో రాజకీయ క్రీడలు ఆగడం లేదని రేవంత్ అన్నారు. శుక్రవారం నాడు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరితే కేసీఆర్ ప్రగతి భవన్ లో కండువా కప్పి ఆహ్వానించారని గుర్తు చేశారు.
కేటిఆర్ ఖైరతాబాద్ అభ్యర్ధి దానం నాగేందర్ కు ప్రగతి భవన్ లో బీ ఫాం అందజేశారన్నారు. ఇవన్నీ పత్రికలల్లో, టివిలల్లో బహిరంగంగా వచ్చాయి. మరీ ఇవి ఎన్నికల కమిషన్ కు కనపడటం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తాము ఎన్నికల ప్రచారాలలో చేసిన వ్యాఖ్యలకు పేపర్ కటింగ్ క్లిప్స్ సమర్పించి మరీ నోటిసులు జారీ చేశారని వీరు బహిరంగంగా చేస్తుంటే మరీ వీరి పై ఎందుకు చర్యలు తీసుకోరని ఎన్నికల కమిషన్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇటువంటి అరాచకాలు చేస్తున్నప్పుడు ఎన్నికల సంఘం సుమోటోగా కేసులు నమోదు చేయాలన్నారు.
కేసీఆర్, కేటిఆర్ లు చట్టాలకు అతిథులా అనే విషయాన్ని చెప్పాలన్నారు. వారం రోజుల్లోగా ఎన్నికల సంఘం వీరి పై కేసులు నమోదు చేయకపోతే కోర్టులో కేసు వేస్తామని రేవంత్ తెలిపారు. ప్రగతి భవన్ ని ప్రచార భవన్ చేస్తున్నారని విమర్శించారు. ప్రగతి భవన్ లో జరిగే రాజకీయ క్రీడలను తక్షణమే అడ్డుకోవాలన్నారు.
ఎన్నికల సంఘం నోటిసులిచ్చినా కూడా కేసీఆర్, కేటిఆర్ లు తమ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారంటే ఎన్నికల కమిషన్ వీరి చేతుల్లో ఉందా లేకపోతే వీరు ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉందా అనే అనుమానాలు ప్రజల్లో కలిగే అవకాశం ఉందని రేవంత్ అన్నారు. రాజ్యాంగబద్దమైన ఎన్నికల కమిషన్ మీద తమకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉందని వెంటనే వారి పై చర్యలు తీసుకోవాలని రేవంత్ ఎన్నికల కమిషన్ ను కోరారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షాలకు ఒక న్యాయం చూపించే విధానం సరైనది కాదన్నారు.