రేవంత్ రెడ్డి అరెస్టు  పై హైకోర్టులో విచారణ

ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన వివాదం పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. రేవంత్ అరెస్టు పై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీంతో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై తమ వాదనలు  గురువారం వినిపిస్తామని రేవంత్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో కేసును 20 వ తేదికి కోర్టు వాయిదా వేసింది.

డిసెంబర్ 4 వ తేదిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ కొడంగల్ పర్యటనకు వచ్చారు. అదే రోజు తమ అనుచరుల పై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ రేవంత్ రెడ్డి కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చారు. రేవంత్ బంద్ కు పిలుపునివ్వడంతో కేసీఆర్ సభకు ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశ్యంతో పోలీసులు రేవంత్ రెడ్డిని 4 వ తేది తెల్లవారు జామున 3 గంటల సమయంలో అరెస్టు చేశారు. రేవంత్ ఇంట్లోకి తలుపులు పగులగొట్టి పోలీసులు ప్రవేశించారు. అతనిని తీసుకెళ్లి జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఉంచారు. 

ఇదే సమయంలో వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆచూకీ పై హైకోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారించిన కోర్టు పోలీసుల తీరు పై మండిపడింది. అంత అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటలిజెన్స్ నిఘా వర్గాల సమాచారం మేరకే అరెస్టు చేశామని వారు తెలిపారు. దీంతో ఆధారాలతో సహా డిజిపి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో డిజిపి హూటా హూటిన కోర్టుకు వచ్చి వివరణ ఇచ్చారు. తెల్ల కాగితం మీద ఇస్తే అది ఆర్డర్ అవుతుందా అంటూ కోర్టు డిజిపిని నిలదీసింది. అదే సమయంలో కేసీఆర్ సభ అయిపోవడంతో అతనిని విడిచి పెడుతున్నామని తెలిపారు. దీంతో కోర్టు కేసును వాయిదా వేసింది. ఈ ఘటనకు బాధ్యురాలిగా వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను సస్పెండ్ చేస్తూ ఈసీ ఆదేశాలిచ్చింది. 

సోమవారం రేవంత్ రెడ్డి కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. దీంతో ఈ కౌంటర్ పై గురువారం వాదనలు వినిపిస్తామని రేవంత్ తరపు లాయర్ తెలిపారు.  దీంతో కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై పలు అనుమానాలు ఉన్నాయని వాటన్నింటి పై ఆధారాలతో సహా నిరూపించేందుకు గురువారానికి గడువు ఇవ్వాలని రేవంత్ లాయర్ కోరారు. దీంతో కోర్టు గురువారానికి కేసు విచారణను వాయిదా వేసింది. రేవంత్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.