రజనీకి గోల్డెన్ టిక్కెట్… చిరంజీవీని బీసీసీఐ గుర్తిస్తుందా?

ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ – 2023కు ఇండియా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ ప్రపంచ కప్ పోటీలు భారత్ వేదికగా జరగనున్నాయి. ఈ భారీ ఈవెంట్‌ కు వీలైనంత ఎక్కువ ప్రచారం కల్పించడంలో భాగంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) కొత్త ఆలోచన చేసింది.

ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా “గోల్డెన్ టికెట్‌” ను తీసుకొచ్చింది. ఇండియాలోని ప్రముఖులకు ఈ గోల్డెన్ టికెట్‌ ను అందజేస్తోంది. అంటే… గోల్డెన్ టికెట్ పొందిన ప్రముఖులు వరల్డ్ కప్ మ్యాచ్‌ లో వీఐపీ మర్యాదలు పొందుతారన్నమాట. అయితే, ఈ గోల్డెన్ టికెట్‌ ను ముందుగా బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్ అందుకున్నారు.

ఈ మేరకు అమితాబచ్చన్‌ కు గోల్డెన్ టికెట్ ను బీసీసీఐ సెక్రటరీ జై షా స్వయంగా అందజేశారు. ఆ తర్వాత సచిన్ టెండుల్కర్ కి ఈ టికెట్ ను అందజేశారు. ఈ సమయంలో వీరిద్దరి తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకి ఈ టిక్కెట్ లభించింది. తాజాగా బీసీసీఐ ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ప్రకటించింది.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ను కలిసి ఆయనకు గోల్డెన్ టికెట్ అందజేశారు జై షా. ఈ సందర్భంగా భాషాసంస్కృతులకు అతీతంగా లక్షలాది మంది హృదయాలపై చెరగని ముద్రవేశారని.. నికార్సయిన సినీ తేజోస్వరూపం, నట దిగ్గజం అంటూ తలైవాను కొనియాడింది.

ఆ సంగతి అలా ఉంటే… బాలీవుడ్ నుంచి అమితాబ్ కు, కోలీవుడ్ నుంచి రజనీకాంత్ కూ ఈ గోల్డెన్ టికెట్ అందించిన బీసీసీఐ… టాలీవుడ్ విషయానికొచ్చేసరికి ఎవరికి ఆ ఛాన్స్ ఇస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి చిరంజీవిని బీసీసీఐ ప్రముఖుడిగా గుర్తించి గోల్డెన్ టిక్కెట్ ఇస్తుందా.. లేక, తెలుగు రాష్ట్రాల వరకూ ఆ టిక్కెట్ రాకుండా ఉంటుందా అనేది వేచి చూడాలి.