ఈవీఎంలపై పోసాని ఆరోపణలు,నాగ్ ఏమంటారంటే..

ఫైర్ బ్రాండ్ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి పోసాని ఎలక్షన్స్ వేళ మరోసారి నోరు విప్పారు. ఈసారి ఆయన రాజకీయ పార్టీలపై కాకుండా ఈవిఎంలపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ చేసిన ఏర్పాట్లపై ఆయన మండిపడ్డారు. ఈవీఎంలపై ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించడం లేదని ఆయన ఆరోపించారు.

ఈ ఉదయం హైదరాబాద్ నగర పరిధిలోని ఎల్లారెడ్డి గూడ పీజేఆర్‌ కమ్యూనిటీ హాల్‌ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయన వచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన పోసాని…, ఈవీఎంలు ఉన్నచోట వెలుతురు సరిగ్గా లేదని, అధికారులు లైట్లను అమర్చలేదని చెప్పారు. ఏ గుర్తు ఎక్కడ ఉందో సరిగ్గా కనిపించడం లేదని, దీనివల్ల వృద్ధులు, కంటి సమస్యలు ఉన్నవాళ్లు అధికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

నాగార్జున ఏమంటారంటే..

రాజకీయాలు చెడిపోయాయని, వాటికి దూరంగా ఉండాలని ఎవరైనా అనుకుంటే, వారికి సమస్యలపై నిలదీసే హక్కుండదని హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఇది ‘ఓటర్స్ డే’ అంటూ, నేడు ప్రతి ఒక్కరూ తప్పకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి వెళ్లాలని కోరారు.

నేడు ఓటు వేయడం పౌరుల బాధ్యతని అన్నారు. ఈ విషయంలో అధికారులు ఎంతగా ప్రజల్లో అవగాహన తెచ్చినా, పలువురిలో ముఖ్యంగా యువతలో రాజకీయాలపై ఓ చెడు అభిప్రాయం ఉందని, దాన్ని తొలగించుకుని ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించాలని అన్నారు. ఓటేసిన వారికే పాలకులను నిలదీసే హక్కుంటుందన్న విషయాన్ని అందరూ గ్రహించాలని కోరారు.