“పవిత్రబంధం” సీరియల్ నటి ఝూన్సీ ఆత్మహత్య

మా టీవీ ఫేం పవిత్రబంధం సీరియల్ నటి ఝూన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో తాను నివాసం ఉంటున్న అపార్ట్ మెంటులోనే ఝూన్సీ ఆత్మహత్య చేసుకుంది. ఝూన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.

ఝూన్సీ సూర్య అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. గత కొద్ది రోజులుగా అతనితో సహజీవనం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. సీరియల్ లో నటించడం సూర్యకు ఇష్టం లేకపోవడంతో ప్రేమించిన వాడికోసం ఝూన్సీ సీరియల్స్ లో కూడా నటించడం లేదు. సీరియల్స్ లో నటించడం మానేసి జూబ్లీహిల్స్ లో ఝూన్సీ బ్యూటి పార్లర్ నడుపుతున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి పెళ్ళి చేసుకోవాలని ఝూన్సీ సూర్యను అడుగుతుంది. కానీ సూర్య తప్పించుకుంటూ పెళ్లి పై సమాధానం ఇవ్వలేదు. దీంతో నెల రోజుల క్రితం నుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు.

ప్రేమించిన వ్యక్తి మోసం చేయడం, ఇష్టంగా భావించే నటనకు దూరం కావడంతో జీవితం పై విరక్తి చెందిన ఝూన్సీ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఝూన్సీ తల్లిదండ్రుల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఝూన్సీ స్వస్థలం కృష్ణా జిల్లా ముదనేపల్లి మండలం వడాలి గ్రామం. ఝూన్సీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.