వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాకింగ్ డెసిషన్!

ప్రస్తుతం ఏపీలో టీడీపీకి చంద్రబాబుకి బయట శత్రువులకంటే ఇంట శత్రువులే ఎక్కువగా ఉన్నారనే కామెంట్లు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఇంతకాలం టీడీపీకి బలంగా ఉన్న ఒక సామాజికవర్గంలో చీలికలు వచ్చాయని.. ఇదే సమయంలో ఇంతకాలం పార్టీకి మరింత బలంగా నిలబడిన నందమూరి కుటుంబ సినీ అభిమానులు సైతం రెండుగా విడిపోయారని కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో వాటికి మరింత బలం చేకూరింది.

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆదివారం ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు కుటుంబ సభ్యులు వచ్చి నివాళులర్పించారు. ముందుగా బాలకృష్ణ… ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని తండ్రి సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆయన కొడుకుగా పుట్టడం తన అదృష్టం అని బాలయ్య చెప్పుకొచ్చారు. మరి బాలయ్యను కనడం ఎన్టీఆర్ అదృష్టమేనా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం!

అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అక్కడకు వచ్చారు. తాత సమాధి వద్ద నివాళులర్పించారు. జూనియర్ రాక సందర్భంగా భారీగా తోపులాట జరిగింది. బౌన్సర్లు కూడా అభిమానుల్ని పక్కకు నెట్టేయలేక చేతులెత్తేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పటినుంచి వెళ్లిపోయే వరకు భారీగా చేరుకున్న అభిమానులు… సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ ఇవేవీ పట్టించుకోనట్టే ఉన్నప్పటికీ.. ఆయన అభిమానులు మాత్రం సీఎం సీఎం అని నినాదాలు చేసి రాజకీయ చర్చకు తెరతీశారు.

దీంతో మరోసారి జూనియర్ టాపిక్ టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకపక్క ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పైగా ఏపీలో అటు సామాజికవర్గం పరంగా చూసినా.. సినిమా అభిమానుల రీత్యా చూసినా జూనియర్ కి బలమైన ఫ్యాన్ బెల్ట్ ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా.. ఇది అక్షర సత్యం. అయితే ఈ ఫ్యాన్ బెల్ట్ మొత్తం ఈసారి సైకిల్ కి దూరమవుతుందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. తామంతా కలిసి ఈ సారి టీడీపీని గెలిపిస్తే… రాజకీయంగా లోకేష్ కు జవసత్వాలు ఇవ్వడం సంగతి తర్వాత… ముందు జూనియర్ ఎన్టీఆర్ కి రాజకీయంగా వెన్నుపోటు పొడిచినవారం అవుతామనే ఆలోచన మొదలైందంట.

అవును… వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తికి ఓటు వేస్తే అది జూనియర్ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినట్లే అని భావిస్తున్నారంట ఎన్టీఆర్ అభిమానులు. లోకేష్ ఫ్యూచర్ కోసం తారక్ ఫ్యూచర్ ని బలిచేయడం భావ్యం కాదని, అందుకు తామంతా ఐక్యంగా ఒకేమాటపై ఉండాలని ఆలోచిస్తున్నారంట. జగన్ కు అనుకూలంగా ఓటు వేయడానికి మనసు రాకపోతే… నోటా కైనా వేసేద్దాం కానీ సైకిల్ కి వెయ్యొద్దని, టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ బలం ఎంతో చంద్రబాబుకి చూపించాలని భావిస్తున్నారంట.

మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తీసుకుంటున్న ఈ నిర్ణయం టీడీపీకి ఎలాంటి షాకివ్వబోతుందనేది వేచి చూడాలి!