మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని లోకేష్.! నమ్మొచ్చా.?

వున్నపళంగా నారా లోకేష్ ‘నాలిక మడతెట్టేశారు’.! ఔను, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ‘యువ గళం’ పాదయాత్ర సందర్భంగా, యువతతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో తన ముందుకు వచ్చిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘మీరు ఎవరికి ఫ్యాన్.?’ అంటూ సినిమాల గురించి నారా లోకేష్‌ని ఎవరో ఓ ప్రశ్న అడిగారట.

ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘నేను మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిని..’ అంటూ సెలవిచ్చారు నారా లోకేష్. ‘చిరంజీవికి వీరాభిమానిని అయినా, ముద్దుల మావయ్య బాలకృష్ణ వున్నారు కదా.. ఆయన సినిమాలు తప్పకుండా మొదటి రోజు మొదటి ఆట చూసేస్తా..’ అని నారా లోకేష్ చెప్పడం గమనార్హం.

‘వాల్తేరు వీరయ్య’ సినిమాని కూడా నారా లోకేష్ చూశారట.! ఇప్పుడీ విషయం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ‘సినిమాని అభిమానించేవారెవరైనా చిరంజీవిని అభిమానించాల్సిందే..’ అంటూ కొందరు మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నారు. అయితే, అసలు విషయం వేరే వుంది. 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులేస్తోన్న టీడీపీ, అత్యంత వ్యూహాత్మకంగానే నారా లోకేష్ నోట చిరంజీవి ప్రస్తావన వచ్చేలా చేసిందట. ఈ తరహా జిమ్మిక్కులు టీడీపీకి కొత్త కాదు.

చిరంజీవి మీద అంత అభిమానం నారా లోకేష్‌కి వుంటే, గతంలో చిరంజీవి మీద టీడీపీ విషం చిమ్మినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు.? ఇప్పటికీ టీడీపీ సోషల్ మీడియా విభాగం, చిరంజీవిని ఏదో ఒక రకంగా ట్రోల్ చేస్తూనే వుంటుంది. టీడీపీ రాజకీయాలే ఇంత.!