నకిరేకల్ లో కదిలిన ఎర్రదండు (వీడియోలు)

నకిరేకల్ లో బిఎల్ ఎఫ్ బలపర్చిన సిపిఎం అభ్యర్ధి జిట్ట నగేష్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు ముందు సిపిఎం కార్యకర్తలు నకిరేకల్ పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి సిపిఎం కార్యకర్తలు, అనుబంధ సంఘాల కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఎర్ర జెండా రెపరెపలతో పట్టణమంతా ఎరుపెక్కింది. ఎర్రదండు కార్యకర్తలతో ముందుకు సాగింది. మహిళా కార్యకర్తలు కోలాట ఆటలతో ర్యాలీలో పాల్గొన్నారు. 

వేలాది మంది కార్యకర్తలు ద్విచక్ర వాహనాల పై , ఆటోలలో తరలి వచ్చారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా భారీ స్థాయిలో జనాలు తరలివచ్చారు. ముదుసలి వయసు వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆటపాటలతో కోలాటాల మధ్య కోలాహాలంగా నామినేషన్ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని గ్రామాగ్రామం నుంచి ప్రత్యేక వాహానాలు కట్టుకొని కార్యకర్తలు నకిరేకల్ చేరుకున్నారు. ర్యాలీలో నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు కదిలారు. ఎర్రదండును చూసిన సిపిఎం నాయకత్వం ఫుల్ జోష్ లో ఉందని నాయకులు తెలిపారు. 

కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న నకిరేకల్ లో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.  రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు టిఆర్ఎస్, కాంగ్రెస్ అని ఎమ్మెల్యే అభ్యర్ధి జిట్ట నగేష్ అన్నారు. పేదల పక్షాన నిలిచి పేద ప్రజల పరిష్కారానికి కృషి చేసేది సిపిఎం పార్టీనే అన్నారు.

నకిరేకల్ లో వీరేశం అరాచకాలు పెరిగాయని అతని అరాచకాలు, ఆగడాలు ఆగాలంటే అది కేవలం కమ్యూనిస్టులతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు అసలు పోటినే కాదన్నారు. రాబోయే రోజుల్లో నకిరేకల్ ను అభివృద్ది లో నంబర్ 1 గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజలంతా మోసపోకుండా ప్రజల కోసం పని చేసే సిపిఎం పార్టీని గెలిపించాలని కోరారు. నర్రా రాఘవరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధన కోసం తాను పని చేస్తానని జిట్ట నగేష్ తెలిపారు. నకిరేకల్ లో నామినేషన్ వేసే ముందు సిపిఎం కార్యకర్తల ర్యాలీ వీడియోలు కింద ఉన్నాయి చూడండి.