చంద్రబాబు, బీజేపీపై కవిత సెన్సేషనల్ కామెంట్స్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ పై టీఆరెస్ ఎంపీ కవిత సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ఆమె ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎప్పుడూ ప్రజలకు అబద్దాలు చెప్పలేదని అన్నారు. ప్రజలకు అన్నీ వాస్తవాలే చెప్పుకుంటూ వచ్చామని తెలిపారు. అలాగే ఆంధ్ర నేతలకు ‘మీ ప్రజలకు కూడా నిజాలే’ చెప్పాలని విజ్ఞప్తి కూడా చేశామని అన్నారు. ఏపీకి ఎటువంటి నష్టం జరుగుతుందో వివరించాలని, విభజన సానుకూలంగా చేసుకుంటే ఎలా ఉంటుందో తెలియజేయాలని కోరామని వెల్లడించారు కవిత.

వారేమో అక్కడి ప్రజల్ని మభ్య పెడుతూ వచ్చారని ఆమె విమర్శలు చేసారు. ఇక చంద్రబాబు మళ్ళీ తెలంగాణాలో అడుగు పెడితే ఎలాంటి నష్టం వాటిల్లుతుందో చెప్పే బాధ్యత మాపై ఉందని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి 20 నుండి 30 లేఖలు రాసారని ఆరోపణలు చేసారు కవిత. పాము చిన్నదైనా పెద్దదైన పాము పామేనని తెలంగాణ ప్రజలకు అర్ధమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తున్నామని కవిత అన్నారు.

చంద్రబాబు తెలంగాణకు చేసేదే నష్టమని, ఆయన తెలంగాణ ప్రజలకు మంచి చేయరన్న విషయం అందరికి తెలుసనీ అన్నారు. అలాంటి బాబుతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని కవిత ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలపై ప్రతిపక్షాలు భయపడుతున్నాయని, అందుకే ఇంకా కోర్టులో కేసులు వేస్తున్నారని ఆరోపించారు కవిత.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లెక్కలు చూస్తే లెక్కలు చెప్పే మాస్టర్లు కూడా ఆత్మహత్య చేసుకుంటారని ఎద్దేవా చేసారు. నాలుగేళ్లలో తెలంగాణకు రెండున్నర లక్షల కోట్లు ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవానికి కేంద్రం ఇచ్చింది 900 కోట్ల రూపాయలని తెలిపారు. ఆయన చెప్పేవన్నీ అవాస్తవాలని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు కవిత.

తెలంగాణాలో నీటి సమస్యల గురించి పరిశీలించామని కవిత తెలియజేసారు. నీళ్ల సమస్యను దూరం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు. 450 పధకాలు చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చాటుకున్నారు. నిజామాబాద్ నియోజకవర్గానికి బీజేపీ నేతలు ఎప్పుడూ చేయని పనులు టీఆరెస్ ప్రభుత్వం చేసిందని ఆమె స్పష్టత ఇచ్చారు. బీజేపీ నాయకుల మాటలను నిజామాబాద్ ప్రజలు పట్టించుకోరని కవిత అన్నారు.