రాజకీయాలన్నాక విమర్శలు సహజం. సినీ రాజకీయం సైతం ఇందుకు మినహాయింపు కాకుండా పోయింది. ప్రకాష్ రాజ్, ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతుండడంపై ‘నాన్ లోకల్’ అంశాన్ని తెరపైకి తెచ్చారు కొందరు. ‘మా’ ప్రతిష్ట మసకబారిందని నాగబాబు విమర్శలు చేస్తే, ఆయన మీదా మాటల దాడి షురూ అయ్యింది.
ఇంతకీ, ఇవన్నీ ఎందుకు.? ఇంకెందుకు.. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల కోసం. ఎన్నికల్లో గెలిచి ఏం చేస్తారు.? ఇంకేం చేస్తారు.? దాదాపుగా వెయ్యి మంది సభ్యలున్న ‘మా కుటుంబం’కి సేవ చేస్తారు. సేవ చేయాలనుకున్నప్పుడు విమర్శలెందుకు.? నీకన్నా బాగా నేను చేస్తాను.. నాకన్నా బాగా నువ్వు చెయ్.. అని పాజిటివ్ కోణంలో ఒకరికొకరు సవాల్ విసురుకోవచ్చు కదా.? కులం, మతం, ప్రాంతం.. ఇలా చాలా రాజకీయాలు నడుస్తున్నాయి ‘మా’ ఎన్నికల చుట్టూ తెరవెనుకాల.. వీటిల్లో కొన్ని రాజకీయాలు తెర ముందు.. అదేనండీ బుల్లితెర ముందు కూడా కనిపిస్తున్నాయి.
న్యూస్ ఛానళ్ళ అత్యుత్సాహమే ఈ పైత్యానికి కారణం కావొచ్చు. ప్రకాష్ రాజ్, జీవిత, విష్ణు.. ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రకాష్ రాజ్ తన ప్యానల్ వివరాల్ని ఇటీవల వెల్లడించారు. జీవిత ఎలాంటి ప్యానల్ లేకుండా పోటీ చేస్తారట. మంచు విష్ణు పోటీ చేయడం ఖాయమేగానీ, ప్యానల్ వివరాలు వెల్లడి కాలేదు. హేమ కూడా బరిలోకి దిగే అవకాశం వుందంటున్నారు.
కాగా, రాజకీయాల్లో ‘మహిళా సెంటిమెంట్’ ప్రయోగించినట్లు, సిని’మా’ ఎన్నికల్లోనూ జీవిత ‘మహిళా కార్డు’ ప్రయోగిస్తుండడం గమనార్హం. ఏళ్ళ తరబడి ‘మా’ భవన నిర్మాణం జరగలేదంటే, ఇంతకు ముందు ‘మా’ అధ్యక్షులుగా పనిచేసినవారు ఏం సాధించినట్లు.? అన్న ప్రశ్నకు పరిశ్రమ పెద్దలు, ‘మా’ ఉద్ధారకులు సమాధానం చెప్పాల్సి వుంటుంది.