మంత్రి రోజాపై కొడాలి నాని ‘పంది’ పురాణం.!

అదేంటీ, ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారు కదా.? పైగా, మంత్రి రోజాకి మాజీ మంత్రి కొడాలి నాని అంటే విపరీతమైన అభిమానం. ‘నా అన్న లాంటోడు’ అని కొడాలి నాని గురించి చెబుతుంటారు మంత్రి రోజా. ‘రోజా తనకు సోదరి లాంటిది’ అని అంటుంటారు కొడాలి నాని. అన్నట్టు, ఇద్దరూ తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఈ ఇద్దరూ ఇప్పుడు వైసీపీలో వున్నారు. చంద్రబాబుని తీవ్రంగా విమర్శించాలంటే అది వైసీపీలో రోజా, కొడాలి నాని తర్వాతే ఎవరైనా.!

అసలు విషయమేంటంటే, టీడీపీ నేతలు కొందరు, ‘పందికి డ్రెస్ వేస్తే రోజాలా వుంటుంది..’ అని విమర్శిస్తున్నారీమధ్య. దాంతో, కొడాలి నానికి కోపమొచ్చింది. ‘టీడీపీ కార్యాలయం నుంచే రోజాపై విమర్శలు చేయిస్తారా.?’ అంటూ విరుచుకుపడిపోయారు.

నిజానికి, కొడాలి నాని తిట్టింది టీడీపీనే. చంద్రబాబుపైనా, నారా లోకేష్‌పైనా ‘వెధవ’ అనీ, ఇంకోటనీ.. కొడాలి నాని తిట్ల దండకం అంతా ఇంతా కాదు. కాకపోతే, పదే పదే ‘రోజాని పంది అంటావా.? పందికి డ్రెస్ వేస్తే రోజా.. అంటావా.?’ అలాగని ప్రచారం చేయిస్తావా.?’ అంటూ కొడాలి నాని ప్రశ్నిస్తూ పోవడం చూస్తోంటే, టీడీపీ కంటే ఎక్కువసార్లు రోజాని ‘పంది’గా కొడాలి నానినే అభివర్ణించినట్లయ్యింది.

సోషల్ మీడియాలో కూడా ‘కట్ అండ్ పేస్ట్’ వీడియోల్లో, కొడాలి నాని పేరుతోనే ఎక్కువ హంగామా నడుస్తోంది. మొన్నటికి మొన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారంపై మాట్లాడుతూ, ‘వైఎస్ వివేకానందరెడ్డిని చంపితే ఏమొస్తుంది.?’ అంటూ ‘కాఫీ, టీ ఖర్చుల’ గురించి మాట్లాడి కొడాలి నాని అభాసుపాలయ్యారు.