కన్నాకు టీడీపీలో ఊహించని గౌరవం… సర్ ప్రైజ్ ఫీలవుతున్న ఫ్యాన్స్!

రాజకీయాల్లోకి వచ్చే ముందు ఏ నాయకుడు అయినా తొందరగా గుర్తింపు, గెలుపూ వచ్చే పార్టీలో చేరాలని భావిస్తాడు. అదేవిధంగా… అప్పటికే రాజకీయాల్లో అన్నీ చూసేసిన వారు పార్టీ మారాలనుకుంటే… ముందుగా చూసేది ఆ వయసులో, తమ అనుభవానికి, స్థాయికీ తగిన గౌరవం ఉన్న పార్టీలో చేరతారు. సముచిత స్థానం దక్కుతుందని భావిస్తేనే.. ఆ మేరకు మాట తీసుకుంటేనే.. ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరుతారు. అలా చేరిన ఒక సీనియర్ పొలిటీషియన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది చూద్దాం…!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణకు ఒక హోదా, ఒక గుర్తింపు ఉండేది. అధ్యక్ష పదవి నుంచి తొలగించినా కూడా.. బీజేపీ హైకమాండ్ ఆయనకు మంచి గుర్తింపునిస్తూ వచ్చింది. కానీ ఆయన బీజేపీని వీడి టీడీపీలో చేరిపోయారు. బీజేపీలో గౌరవం దక్కడం లేదని.. అడుగడుగునా అవమానాలేనని.. టీడీపీలో తనకు పుష్కలంగా గౌరవం దొరుకుతుందని, జనసేనకు మించిన ఆదరణ దొరుకుతుందని చెప్పుకొచ్చారు! అయితే ఆయన ఇప్పుడు టీడీపీలో గుంపులో గోవిందయ్యగా మారిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఫోటో చూసినవారెవరైనా… ఆ ఫోటోలో నల్ల ఫ్యాంటూ – తెల్ల షర్టూ వేసుకున్న వ్యక్తిని చూసి, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తేమో అనుకుంటారు. కానీ… అక్కడ చేతులు కట్టుకుని, బుద్దిమంతుడైన విద్యార్థిలా, క్రమశిక్షణ కలిగిన శిష్యుడిలా, ఎస్ బాస్ అనడానికి రెడీగా ఉన్న అసిస్టెంట్ లా నిల్చున్న వ్యక్తి ఒకప్పటి మంత్రి. అవును… వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ లలో ఒకరైన కన్నా లక్ష్మీనారాయణ ఆయనే!

చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తే.. టీడీపీలో చేరితే… తనకు సముచిత స్థానం దక్కుతుందని, తనకు ఎక్కడలేని గౌరవం దక్కుతుందని ఆశించి, అభిమానులకు చెప్పుకుని, కార్యకర్తలను కన్ వెన్స్ చేసుకుని సైకిల్ ఎక్కిన కన్నా లక్ష్మీనారాయణకు… టీడీపీలో దొరుకుతున్న గౌరవం అది! దీంతో… ఆ ఫోటో చూసిన ఆయన అభిమానులు తెగ ఫీలయిపోతున్నారు. తమ అనుభవంలో కన్నాను ఈ స్థాయిలో ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. ఇక, పొరపాటున చంద్రబాబు సీఎం అయితే… కన్నా పరిస్థితిని ఊహించుకోవడానికే భయమేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.