వదల బొమ్మాళీ నిన్నొదలా!.. అంటూ అరివీర భయంకరుడు అయిన అఘోరా (సోనూసూద్) జేజమ్మ (అనుష్క) వెంటపడుతూ.. వికృతమైన అరుపుల్ని అరవడాన్ని తెలుగు ప్రజలు, సినీ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్ని.. పచ్చ మీడియాల వైఖరిని చూస్తుంటే ఈ తరహాలోనే కనిపిస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ ఎంతగా కళ్లెం వేస్తున్నా అంతకుమించి నెగెటివ్ కథనాలతో పచ్చ మీడియా చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ఓవైపు కరోనా మహమ్మారీ తరుముతూ ఉంటే ఇలాంటి టైమ్ లో వ్యతిరేక కథనాలతో ఆంధ్రజ్యోతి -ఏబీఎన్- టీవీ 5- ఈనాడు వంటి పచ్చ మీడియాలు వేడెక్కిస్తుండడంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
అయితే ఈ ప్రచారం వైద్యుల నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీసేదిగా ఉందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు ప్రజల్లోకి వచ్చి మహమ్మారీని తరిమేసేందుకు పని చేస్తున్న వైద్యులు.. అధికారుల్లో భయాన్ని పారద్రోలేందుకు యువ ముఖ్యమంత్రి తనవంతు ప్రయత్నం చేస్తుంటే పత్రికల్లో కథనాలు.. ప్రతిపక్షాల అరుపులు భయాన్ని పెంచేవిగా ఉన్నాయి. కరోనాతో ప్రజలు సహజీవనం చేయాల్సిందేనని సాక్షాత్తూ వైరస్ జన్మస్థానమైన చైనా స్థానిక వైద్యులు, అధికారులే ధృవీకరిస్తుంటే ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించిన జగన్ పైనే వ్యతిరేక కథనాల్ని ప్రచురితం చేశాయి పచ్చ మీడియాలు. తీవ్రమైన వ్యాధి అయినా ప్రజల్ని భయపెట్టకూడదనే సదుద్ధేశంతో జగన్ చేసిన ప్రసంగాన్ని ప్రత్యర్థులు తీవ్రంగానే తప్పు పట్టారు. తాజాగా కరోనా వైరస్ పై ప్రాణాలకు తెగించి పోరాటం జరుపుతున్న వైద్యుల నైతిక స్థయిర్యం దెబ్బతినే విధంగా వార్తలు ప్రసారం చేసినందుకు టీవీ5 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మూర్తిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు.
ఇంతకుముందు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వైద్యుడు సుధాకర్ తమకు ఎన్ 95 మాస్కులు ఇవ్వలేదని ప్రభుత్వం తమకు ఏమాత్రం సహకరించడం లేదని ఆరోపించడం.. దానిని హైలైట్ చేస్తూ పచ్చ మీడియాలు కథనాలు వండి వార్చడం.. పనిలో పనిగా జగన్ ని టార్గెట్ చేస్తూ కథనాలు వేయడం తెలిసిందే. ఆ తర్వాత ఆ వైద్యుడిని ఏప్రిల్ 8న ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. డాక్టర్ సుధాకర్ రావును ఇంటర్వ్యూ చేయడం, టీవీ 5లో వ్యాఖ్యానాలు చేయడం తరచూ కరోనాపై వైద్యుల నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీసే విధంగా ప్రసారాలు చేయడం తదితర కారణాలతో పోలీసులు మూర్తిపై కేసు నమోదు చేశారు. పోలీసుల్ని మూడు బృందాలుగా రెడీ చేసి ఈ కేసుపై విచారిస్తున్నారు. మూర్తికి ఇక భజంత్రీ మొదలైనట్టేనన్న చర్చ సాగుతోంది. వదల బొమ్మాళీ అంటూ యువసీఎం వెంట పడితే ఈ తరహా ట్రీట్ ఖాయంగా ఉంటుందని అర్థమవుతోంది. ఇప్పటికే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కానీ టీవీ 5 కానీ ఏపీలో కేబుల్ ద్వారా ప్రసారం కావడం లేదు. ఏవైనా డిష్ లు యాంటెన్నాలలో తప్ప ఆ టీవీలు ఉన్నాయనే జనాలకు తెలీదు. టీఆర్ పీ గేమ్ ఆడుతూ పచ్చ నాయకుల్ని కాపాడే ఆయా మీడియాల్ని తెలంగాణలో కేసీఆర్.. ఆంధ్రాలో జగన్ ఓ ఆటాడుకుంటున్నారన్నది బహిరంగ రహస్యం. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పచ్చ మీడియా పీచమణచడంలో పోటీపడుతున్నారు. ఆ ఇద్దరూ భయంకర అఘోరాల్నే వదిలిపెట్టని అరుంధతుల్లా మారారన్న చర్చా ప్రజల్లో సాగుతోంది.
