iBomma Website Closed: ‘ఐబొమ్మ’కు శాశ్వత తెర: పైరసీ వెబ్‌సైట్ సేవలు నిలిపివేత; నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్

తెలుగు సినీ పరిశ్రమకు దీర్ఘకాలంగా తలనొప్పిగా మారిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) తన సేవలను శాశ్వతంగా నిలిపివేసింది. ఈ వెబ్‌సైట్‌ను తెరిచిన యూజర్లకు ప్రస్తుతం “మీ దేశంలో మా సేవలు శాశ్వతంగా నిలిపివేయబడ్డాయి… నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నాము” అనే అధికారిక సందేశం కనిపిస్తోంది.

ఈ వెబ్‌సైట్ నిలిపివేతకు ప్రధాన కారణం.. దాని నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవల హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడమే.

విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి, కరీబియన్ దీవులలో ఉంటూ ‘ఐబొమ్మ’, ‘బప్పం టీవీ’ వంటి అనేక పైరసీ వెబ్‌సైట్లను నడుపుతున్నాడు. కొత్త సినిమాల మాస్టర్ ప్రింట్‌లను దొంగిలించి వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా రవి భారీగా అక్రమ ధనాన్ని ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు.

రవి తన భార్యతో విడాకుల ప్రక్రియ నిమిత్తం భారత్‌కు వచ్చిన సమయంలో ఈ అరెస్ట్ జరిగింది. రవి భార్య అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి, కూకట్‌పల్లిలోని అతని నివాసంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అరెస్ట్ అనంతరం, రవి చేతనే ‘ఐబొమ్మ’ మరియు ‘బప్పం టీవీ’ వెబ్‌సైట్‌లను శాశ్వతంగా మూసివేయించారు. ఈ పైరసీ దందా ద్వారా సంపాదించిన డబ్బుతో రవి హైదరాబాద్‌లో సుమారు రూ. 3 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

తాజా పరిణామంతో, తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద ముప్పుగా మారిన ఈ రెండు ప్రధాన పైరసీ వెబ్‌సైట్లు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయాయి.

Cine Critic Dasari Vignan Review On Varanasi || Mahesh babu || Priyanaka Chopra || Raja Mouli || TR