టిఆర్ఎస్ లాయల్ లాయర్లకు భారీ షాక్

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో హైకోర్టులో అడ్వొకెట్లు టిఆర్ఎస్ అనుకూల లాయర్లకు గట్టి షాక్ ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీకి, కేసిఆర్ ఫ్యామిలీకి అతి దగ్గరి వ్యక్తిగా గండ్ర మోహన్ రావు ముద్ర పడ్డారు. ఆయన టిఆర్ఎస్ అధికారిక చానెల్ టిన్యూస్ వ్యవస్థాపక సభ్యులు అని ప్రచారం ఉంది. ఆయనకు ఇప్పుడు జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 2600 ఓట్లకు గానూ కేవలం 280 ఓట్లు మాత్రమే రావడం న్యాయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

తెలంగాణ బార్ కౌన్సిల్ లో సుమారు 23వేల ఓట్లు ఉండగా జూన్ 29న ఓటింగ్ జరిగితే 14 వేల ఓట్లు పోల్ అయ్యాయి. దానికి గాను హైకోర్టులో 3500 ఓట్లు ఉండగా 2600 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైకోర్టు న్యాయవాదుల ఓట్ల లెక్కింపు సోమవారం పూర్తయింది. హైకోర్టులో వచ్చిన ఫలితాలను చూస్తే.. టిఆర్ఎస్ అనుకూల న్యాయవాదులకు గట్టి షాక్ ఇచ్చాయి. మరో పది రోజుల్లోగా పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

నిజానికి రెండేళ్ల క్రితం ఈ హైకోర్టు న్యాయవాదులే గండ్ర మోహన్ రావును నెత్తిన పెట్టుకుని ఊరేగారు. అంటే 2016లో తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో గండ్ర మోహన్ రావు 1900 ఓట్లు సాధించి బార్ అసోసియేషన్ ప్రసిడెంట్ గా ఘన విజయం నమోదు చేశారు. ఆయన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కేవలం 600 మాత్రమే. అంటే 1300 ఓట్ల మెజార్టీ సాధించారు గండ్ర. గండ్ర మోహన్ రావుకు వచ్చిన మెజార్టీలో సగం కూడా కాంగ్రెస్ పార్టీ అనుకూల అభ్యర్థికి రాకపోవడం గమనార్హం.

కానీ రెండేళ్లలో సీన్ మారిపోయింది. ఇప్పుడు బార్ కౌన్సిల్ కు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలోని అందరు అడ్వకెట్స్ బార్ కౌన్సిల్ కు 25 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందులో ఇప్పటికే హైకోర్టులో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా వచ్చాయి. అయితే బార్ కౌన్సిల్ సభ్యుడిగా పోటీ చేసిన టిఆర్ఎస్ న్యాయవాది అయిన గండ్ర మోహన్ రావుకు గట్టి ఎదురుదెబ్బ తాకింది. గతంలో ఇదే హైకోర్టులో 1900 మంది ఓట్లు వేస్తే ఈసారి కేవలం 280 మంది మాత్రమే ఆయనకు ఓటు వేశారు. ఇది ఊహించని పరిణామం అని అడ్వకెట్స్ చెబుతున్నారు.

హైకోర్టులో బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఉద్యమకారుడైన ఒక న్యాయవాది తెలుగురాజ్యం తో మాట్లాడారు. హైకోర్టులో వెలువడిన ఫలితమే కేసిఆర్ సర్కారుపై న్యాయవాదులు ఆగ్రహంగా ఉన్నారనడానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న న్యాయవాదులకు టిఆర్ఎస్ సర్కారు చేసిందేమీలేదని న్యాయవాదులు భావిస్తున్నారని చెప్పారు. అందుకే 1900 ఓట్ల నుంచి 280కి పడిపోయారని చెప్పారు. గండ్ర మోహన్ రావు పేరు చెబితే హైకోర్టు వరకు ఆయనే కేసిఆర్ అన్నట్లుగా తామంతా భావిస్తామన్నారు. రెండేళ్ల క్రితం ఆయనే కేసిఆర్ అన్నట్లుగా భావించి ఓట్లు గుద్దిన అడ్వకెట్లే రెండేళ్లలో ఆయనకు ఓట్లేయలేదన్నారు. ముఖ్యమంత్రి మనిషి కావంతోనే వ్యతిరేకంగా ఓటు వేశారని వివరించారు. ఇది టిఆర్ఎస్ సర్కారుకు గట్టి ఎదురు దెబ్బ అని ఆయన వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ కు చెందిన వారు ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్న కారణంగా గండ్రకు ఓట్లు తగ్గాయన్న వాదనను ఆయన ఖండించారు. కేసిఆరే గండ్ర.. గండ్ర మోహన్ రావే కేసిఆర్ అనుకున్నప్పుడు ఏక్ దమ్ అన్ని ఓట్లు ఎట్లా తగ్గుతాయని ఆయన ప్రశ్నించారు. అయినా టిఆర్ఎస్ అనుకూల న్యాయవాదులందరికీ కలిపినా 500 ఓట్లకు మించలేదన్నారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ సర్కారు న్యాయవాదుల విశ్వాసాన్ని పొందేందుకు సిన్సియర్ గా ప్రయత్నం చేయాలన్నారు.

ఇది రెండో షాక్…
మొన్నటికి మొన్న హైకోర్టులో జరిగిన బార్ అసోషియేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుకూల అభ్యర్థి వినోద్ రెడ్డి మూడో స్థానంలోకి నెట్టబడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సి. దామోదర్ రెడ్డి గెలుపొందారు. అయితే ఆయన కు పోటీ ఇచ్చింది కూడా కాంగ్రెస్ అనుకూల అడ్వొకెట్ పొన్నం అశోక్ గౌడ్ కావడం గమనార్హం. తెలంగాణ వచ్చిన రెండేళ్లలోనే లాయర్లు టిఆర్ఎస్ సర్కారు పట్ల ఉట్లా కావడం ఇది రెండోసారి అని చెబతున్నారు.

హైకోర్టు న్యాయవాదల ఓట్లు ఎవరెవరికి ఎన్ని వచ్చాయో కింద లిస్ట్ ఉంది చూడొచ్చు.