అంతా గూఢచారులే, ఆంధ్ర గవర్నమెంటులో అంతా గందరగోళం

కేంద్రం అండ, వైసిసి మద్దతు పుష్కలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం తానే రాజుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఎవరూ ఎపుడూ ఢీ కొనని విధంగా ఆయన ఎన్నికలయిన సంధికాలంలో ముఖ్యమంత్రితో ఢీ కొంటున్నారు. నువ్వు ఉత్త ముఖ్యమంత్రివే…పవర్స్ లేవు,అన్నీనేనే,పాలన చేసే ది నేను, సమీక్షలు చేసేది నేను అని ఖరాకండిగా చెప్పేశారు.

ఇలాంటిపరిస్థితి ఏ రాష్ట్రంలోనూ వచ్చి ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. అందునా చంద్రబాబు నాయుడి వంటి ముఖ్యమంత్రికి వచ్చింది. అయితే, ఇంత జరుగుతున్నా చీఫ్ సెక్రెటరీ అంత హ్యాపీగా లేరని, ఆయన సమావేశాలలో సీరియస్ అవుతున్నారని సమాచారం.

తన మీద కొంతమంది అధికారులు చంద్రబాబు తరఫున నిఘా పెడుతున్నారని, ఇది సహించనని హెచ్చరించినట్లు తెలిసింది.

అంతేకాదు, ఈ విషయాన్ని ఆయన ఎన్నికలకమిషన్ దృష్టికి, రాష్ట్ర ఎన్నిలక ప్రధానాధికారి గోపాల్ ద్వివేదీ దృష్టికి కూడా తీసుకువెళ్లారని చెబుతున్నారు.

అసలు విషయం ఏంటంటే, తాను సమావేశం ఏర్పాటుచేసిన విషయమంతా ముఖ్యమంత్రికి పూస గుచ్చినట్లు తెలిసిపోతున్నదనట, తాను ఏమ్మాట్లాడిన సిఎం కు తెలిసిపోతున్నదట. దీనితో 
సీఎస్ సీరియస్ అవుతున్నారని అధికారులు చెబుతున్నారు.

ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో ఐఎఎస్ అధికారులు రెండుగా విడిపోయారు. ఒక వర్గం, వచ్చేది వైసిపి ప్రభుత్వం కాబట్టి, ఇక మనం చంద్రబాబు కు విదేయంగా ఉండాల్సిన పనిలేదని నిర్ణయించుకున్నారు. వచ్చేది ఏ ప్రభుత్వమయినా మనల్ని ఇంతదాకా తెచ్చింది టిడిపి ప్రభుత్వమే కాబట్టి మే 23 దాకా ముఖ్యమంత్రి కి విధేయంగావుండటం తప్పులేదని భావిస్తున్నవాళ్లు మరొక వర్గం.

వీళ్లకి తోడు మరొక వర్గం కూడా తోడయింది. రిటైరయిపోయాక తమని చంద్రబాబు నాయుడు ఏ  మాత్రం పట్టించుకోలేదని అసంతృప్తితో ఉన్నవాళ్లు ఈ వర్గం. వీళ్లు సిఎస్ కు అవుట్ సైడ్ సపోర్టు అందిస్తున్నారు.

అందువల్ల సమావేశాలలో గూఢచారులు ఎక్కువయిపోయారు. చంద్రబాబు సైడ్ ఎం జరుగుతున్నదో అది వెంటనే వైసిపికి చేరవేసి ‘మంచి బాలురు’ అరి  కొంతమంది అధికారులు లోటస్ పాండ్ నుంచి సర్టిఫికెట్ సంపాయించుకుంటుంటే, మరికొందరు తమకు తెలిసిన సమాచారాన్నంతా చంద్రబాబుకు చేరవేసి ‘లాయల్‘ అనిపించుకుంటున్నారు.

దీనితో ఎవరు ఏమిటి అనేది స్సష్టం లేక మంత్రులొక వైపు, సిఎస్ ఒక వైపు అందరిని శంకించుకుంటున్నారు.  అపుపడుపుడు ఆగ్రహం చెందుతున్నారని అధికారి ఒకరు చెప్పారు.

అటూ ఇటూ గూఢచారులు ఎక్కువ కావడంతో ముఖ్యమంత్రి మీద ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి మీద ముఖ్యమంత్రి కారాలు మిరియాలు నూరుతున్నారు. అసలే, ఎల్ వి సుబ్రహ్మణ్యాన్ని నియమించడం బాబుకు ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పుణేతా ను తీసేసి 1983 బ్యాచ్ ఐఎఎస్ కు చెందిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించడం ఆయనకు నచ్చలేదు.

ఇది మామూలు బదిలీ కాదని, వైసిపి ప్రోద్బలంతో ఎన్నికల కమిషన్ చేసిన రాజకీయ బదిలీ అని ఆయన ఆగ్రహం.

జగన్ కేసుల్లో నిందితుడైన ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఎలా సీఎస్‌గా నియమిస్తారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇలా తన మీద ఇలా నిందితుడని బ్రాండ్ వేయడం ఎల్ వికి నచ్చలేదు. గతంలో ఏమో గాని, ఇపుడయితే ఆయనకు చాలా చాలా రాజకీయ మద్దతు ఉంది. తనని చంద్రబాబు జగన్ సహనిందితుడన్నందుకు ఆయన ఏకంగా ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించారు. ఆయనకు మాజీ చీఫ్ సెక్రెటరీలు కొందరు మద్దతు పలికారు. దీంతో కొన్ని రోజుల నుంచి ఏపీలో ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వానికి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఇప్పుడు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేస్తున్న ప్రతి సమీక్ష మీద ముఖ్యమంత్రి నిఘా పెట్టి ఆయన కు వ్యతిరేకంగా సమాచారమంతా సేకరించి పెట్టుకుంటున్నారట. సీఎస్‌ను విమర్శించడానికి ముఖ్యమంత్రికి కొత్త ఆయుధాలు దొరుకుతున్నాయని ఎల్ వి ఆందోళన చెందుతున్నారట.

సీఎస్ తీసుకోబోతున్న కీలక నిర్ణయాలు కూడా సిఎంకు ముందే తెలిసిపోతున్నాయట. దీంతో సీఎస్ సీరియస్ అవుతున్నారని సమాచారం. అంతేకాదు ఆయన తనపై నిఘా పెడుతున్నారంటూ ఏపీ ఎన్నికల అధికారి గోపాల్ ద్వివేదికి ఫిర్యాదు కూడా చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.