ప్రణయ్ మరణ వార్తను అమృతకు వెంటనే చెప్పలేదు – డాక్టర్ జ్యోతి

మారుతీరావు దంపతులకు వివాహమైన ఎంతో కాలానికి అమృత వర్షిణి పుట్టిందని, మారుతీరావు భార్య తన ఆస్పత్రిలోనే డెలీవరి చేసుకుందని మిర్యాలగూడకు చెందిన ప్రముఖ డాక్టర్ జ్యోతి వెల్లడించారు. ఆలస్యంగా పుట్టిన అమృతను తల్లిదండ్రులు ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారని తెలిపారు.  ఓ టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అమృత తల్లికి తానే రెగ్యూలర్ చెకప్ చేసేదాన్నని దాదాపు 25 ఏళ్ల కిందటి సంగతులను ఆమె గుర్తు చేసుకున్నారు. అమృత జ్యోతి హాస్పిటల్ లోనే పుట్టిందని, అమృత కుటుంబం తనక ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారారని, వాళ్ల ఇంట్లోని ఫంక్షన్లకూ కూడా తాను వెళ్లేదన్నన్నారు. అమృత తనను అత్తా అని పిలిచేదని డాక్టర్ జ్యోతి అన్నారు.

అమృత గర్బం దాల్చిన తర్వాత భయపడుతూనే తన వద్దకు వచ్చిందని, తాను కూడా అమృత పెళ్లి చేసుకుందని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నానని, ప్రెగ్నెన్సీ వచ్చిన తరువాతే కలిసిందని తెలిపారు. పేరేంట్స్ సపోర్ట్ లేకపోవడంతో తాను అమృతతో ఎక్కువ సేపు గడిపి జాగ్రత్తలు తెలిపేదాన్నని, ఎప్పటికప్పుడూ కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చానన్నారు. తన కళ్ల ముందే ప్రణయ్ కొన ఊపిరితో చనిపోయాడన్ని ఈ విషయాన్ని తాను జీర్ణించుకోలేక పోయానన్నారు.  

కత్తితో దాడి తరువాత ప్రణయ్ చనిపోయిన విషయాన్ని తరువాతి రోజు వరకు అమృతకు చెప్పకుండా తాను దాచిపెట్టానని ఆ సమయంలో అమృత పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ప్రణయ్ బతికే ఉన్నాడని అబద్దం చెప్పి ఆమె దగ్గరే ఉన్నానన్నారు. ప్రణయ్ కి ఫస్టు ఎయిడ్ చేసిన తర్వాత అంబులెన్స్ లో హైదరాబాద్ పంపించానని అక్కడ ఐసీయూలో అతనికి చికిత్స జరుగుతుందని చెప్పానన్నారు.

 ప్రణయ్ తప్పకుండా వస్తాడని ఒక రోజంతా నమ్మించానని డాక్టర్ జ్యోతి తెలిపారు. ఆ తరువాత కాస్త సీరియస్ గా ఉన్నాడని 20 శాతం మాత్రమే అవకాశాలని చెప్పి ఆమెను ప్రిపేర్ చేయాల్సి వచ్చిందన్నారు. తానేదో మంచి వార్తను ఇస్తాననే నమ్మకంతో అమృత మరుసటి రోజు ఉదయం వరకు ఆశగా వేచి చూసిందని అసలు విషయాన్ని చెప్పిన తర్వాత అమృత దగ్గరే 3 గంటల పాటు కూర్చుని ఓదార్చానని అన్నారు. ఆ సమయంలో ప్రణయ్ చనిపోయాడన్న బాధలో అతడి తల్లిదండ్రులు ఉన్నారని, అమృతను తాను సొంత కూతురిలా భావించి ఓదార్చానని డాక్టర్ జ్యోతి తెలిపారు.