అమరావతి నుంచి వైజాగ్ కి రాజధాని తరలింపు ఘట్టం క్లైమాక్స్ కి చేరనుందా? అందుకు ముహూర్తం ఫిక్సయ్యిందా? అంటే అవుననే సమాచారం. ఇన్నాళ్లు కరోనా క్రైసిస్ వల్ల రాజధాని వ్యవహారం తెరమరుగైపోయింది. అమరావతిలో కానీ వైజాగ్ లో కానీ రాజధానిపై సౌండ్ అన్నది పెద్దగా వినిపించలేదు. అయితే రాజధాని షిఫ్టింగ్ విషయంలో వైకాపా అధినాయకుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదని తాజా సన్నివేశం చెబుతోంది.
ఆరు నూరైనా తరలింపు వైపే ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఆ విషయంలో తనకు అడ్డు తగిలిన వారికి చెక్ పెట్టేందుకు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తనవంతు ప్రయత్నాన్ని ఆపడం లేదు. కోర్టుల పరిధిలో చుక్కెదురైనా.. ప్రతిపక్షాలు నానా యాగీ చేసినా అదేదీ జగన్ ని అడ్డుకోలేని సన్నివేశమే కనిపిస్తోంది. ఇటీవలే భీమిలి- ఆనందపురం పరిసరాల్లో 6 లైన్ల రోడ్ కి సమీపంలో రాజధాని ఏర్పాటు ఉంటుందని వైకాపా సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు.
అంతకుముందే.. ఎట్టకేలకు సీఎం క్యాంప్ ఆఫీస్ కి ముహూర్తం కుదిరిందని తెలుస్తోంది. 28 మే 8.30 ఏఎం అమరావతి నుంచి వైజాగ్ కి సీఎం క్యాంప్ ఆఫీస్ తరలి రానుందని తెలుస్తోంది. ఆ మేరకు `తెలుగు రాజ్యం`కు ఎక్స్ క్లూజివ్ సమాచారం అందింది. వైజాగ్ ఇక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయినట్టే. అయితే ఇంతకుముందు చెప్పినట్టు బీచ్ రోడ్ లోని మిలీనియం టవర్స్ లో క్యాంప్ ఆఫీస్ పెట్టడం లేదు. విశాఖ విజ్ఞాన్ కాలేజ్ .. ఇండియా బుల్స్ ప్రాపర్టీస్ కి సమీపంలోని గ్రేహౌండ్స్ కాంపౌండ్ భవంతుల్ని క్యాంప్ ఆఫీస్ కోసం ఉపయోగించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈరోజు (12 మే) 20 లారీల్లో ఫర్నీచర్ కూడా తరలి వచ్చిందన్న లీక్ తెలుగు రాజ్యం కి అందింది.
ఇంతకుముందు బీచ్ రోడ్ లో మిలీనియం టవర్స్ ని క్యాంప్ ఆఫీస్ కోసం పరిశీలించినా ఇక అక్కడ లేనట్టేనని తెలుస్తోంది. అలాగే మిలీనియం టవర్స్ సహా ఆంధ్రా యూనివర్శిటీ ఆర్ట్స్ బ్లాక్ లు ఇంతకుముందే ఖాళీ చేయించారు.. ఇవన్నీ రకరకాల ప్రభుత్వ ఆఫీసులుగా మారబోతున్నాయని తెలుస్తోంది. జేజమ్మ అఘోరాలు దిగొచ్చినా వైజాగ్ రాజధాని ఆగదు! అని వైకాపాకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ఇటీవల వ్యాఖ్యానించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
