రాజకీయాల్లోంచి తప్పుకుని మంచి పనే చేశానని పదే పదే చిరంజీవి తనను తాను సమర్థించుకుంటుంటారు. ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి.. ఇన్ని గుర్తింపులున్నాయి చిరంజీవి పేరు ముందర.!
కానీ, మెగాస్టార్ చిరంజీవి.. అన్న పిలుపే ఆయనకు బోల్డంత గౌరవాన్ని, హుందాతనాన్ని తెచ్చిపెడుతన్నాయ్. సినీ పరిశ్రమ పెద్ద.. అన్న గౌరవమూ ఆయనకు దక్కింది. అదే, రాజకీయాల్లో వుంటే, ‘రక్తం అమ్ముకున్నోడు..’ అనే విమర్శ ఎదుర్కోవాల్సి వచ్చేది.
జనం ఎప్పుడో చిరంజీవి రాజకీయ జీవితాన్ని మర్చిపోయారు. కొద్ది రోజుల క్రితం మొగల్తూరులో ‘చిరంజీవి మా ఊరికి ఏమీ చేయలేదు..’ అంటూ కొందరు జనం వెర్రి వెంగళప్పల్లా మాట్లాడారు. వాళ్ళెవరూ అక్కడి ఎమ్మెల్యేలనీ, మంత్రుల్నీ, పార్లమెంటు సభ్యుల్నీ అడగరు, అడగలేరు.! అదంతే. రాజకీయం ఇలాగే వుంటుంది మరి.!
ఇక, చిరంజీవి ముందర తాజాగా ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన ప్రశ్న ఒకటి వుంచారో జర్నలిస్టు. ప్రజారాజ్యం పార్టీ వుండి వుంటే, ఆంధ్రప్రదేశ్‌లో అది బలంగా వుండేది కదా.? అన్నదే ఆ ప్రశ్న. ‘కానీ, అలా జరిగితే నేను సినిమాల్లో వుండేవాడిని కాదు. పైగా, తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రానికే పరిమితమవ్వాల్సి వచ్చేది..’ అని చిరంజీవి వ్యాఖ్యానించడం గమనార్హం.
విభజన రాజకీయాలు ఎంత ఛండాలంగా వుండేవో చిరంజీవి ఈ మాటతో చెప్పకనే చెప్పేశారు. రాజకీయాల్లో చిరంజీవి ఆశించిన మార్పు ఎప్పటికీ రాదు. ఆ విషయం అర్థమయ్యే రాజకీయాల నుంచి చిరంజీవి తప్పుకున్నారు. సుతిమెత్తగా.. ఓటర్లను చైతన్యవంతుల్ని చేసేలా చిరంజీవి, ఇదిగో ఇలా సెటైర్లు వేస్తున్నారన్నమాట.