కాంగ్రెస్ పార్టీ మీదే కాదు, అసలు రాజకీయాల మీదనే మెగాస్టార్ చిరంజీవికి ఆసక్తి లేదు. ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పారు కూడా.! ఓపిక వున్నంతకాలం సినిమాల్లో నటిస్తూనే వుంటాను తప్ప, రాజకీయాల్లోకి రానే రానని తేల్చేశారు చిరంజీవి. కానీ, అదిగో చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాడనే ప్రచారమైతే జరుగుతోంది.
మొన్నీమధ్యనే ఓ కాంగ్రెస్ నేత, ‘చిరంజీవి ఆంధ్రప్రదేశ్‌లో మా పార్టీ తరఫున సీఎం అభ్యర్థి..’ అని ప్రకటించేశారు. ఇదేదో ఉత్తుత్తి ప్రకటన కాదుట.! కాంగ్రెస్ అధినాయకత్వం, చిరంజీవితో ఇటీవల ఆ దిశగా సంప్రదింపులూ జరిపిందట.
2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి, ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన సంగతి తెలిసిందే. అప్పటికి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా వున్న చిరంజీవి, రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు తీసుకున్నారు.
రాజ్యసభ పదవీ కాలం ముగిశాక, రాజకీయాల్లో మళ్ళీ కనిపించలేదు చిరంజీవి. కాంగ్రెస్‌లో తన సభ్యత్వాన్ని కూడా ఆయన రెన్యువల్ చేసుకోలేదు. కానీ, ‘చిరంజీవి మా పార్టీ నాయకుడే’ అని కాంగ్రెస్ నేతలు చెబుతుండడం చూస్తున్నాం.
తాజాగా, అంటే వైఎస్ షర్మిలని ఏపీసీసీ అధ్యక్షురాలిని చేసే క్రమంలో చిరంజీవితోనూ కాంగ్రెస్ అధినాయకత్వం సంప్రదింపుల కోసం ప్రయత్నించిందట. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చిరంజీవి తనను సంప్రదించిన కొందరు కాంగ్రెస్ నేతలకు తేల్చి చెప్పారట.
కాంగ్రెస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా చిరంజీవికి గాలం వేస్తోంది. జనసేన పార్టీ తరఫున అయినా ప్రచారం కోసం రావాలని గతంలో చిరంజీవిని బీజేపీ కోరిన సంగతి తెలిసిందే. బీజేపీ పంపిన రాజ్యసభ ప్రతిపాదనని కూడా చిరంజీవి తిరస్కరించారు అప్పట్లో.