చిరంజీవి మీద ఆశలు వదులుకున్న కాంగ్రెస్ …

మెగా స్టార్ చిరంజీవి ఈ ఎన్నికల్లో  అటు ఆంధ్రలో గాని, ఇటు తెలంగాణలో గాని,  కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడని విశ్వసనీయంగా తెలిసింది. ఆయన సన్నిహితుడు, పూర్వపు ప్రజారాజ్యంలో కీలక పాత్ర వహించిన  నాయకులొకరు చిరంజీవి నిర్ణయాన్ని ‘తెలుగు రాజ్యం’ కు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన మీద ఆశలు వదులుకుంది. తెలంగాణలో ఎన్నికల వాతావరణం వెడుక్కుతున్నా, ఆయన ప్రచారం గురించి ఎలాంటి సందడి లేదు. తెలంగాణ కాంగ్రెస్ తరఫున  ఎన్నికల కమిషన్ కుపంపిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలోె ఆయన పేరు లేదు. కేవలం   మాజీ హీరోయిన్  విజయశాంతి మాత్రం ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి ప్రచారం చేస్తే బాగుంటుందని లోలోపల ఉన్నా తెలంగాణ నాయకులెవరూ బహిరంగంగా చిరంజీవి  క్యాంపెయిన్ చేయాలని కోరడం లేదు. ‘చిరంజీవి క్యాంపెయిన్ చేసినా ఒకటే,చేయకపోయినా ఒకటే. తెలంగాణ రాజకీయాలు  ఆంధ్రకంటే భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణలోె ఆంధ్ర నాయకులు క్యాంపెయిన్ చేయకపోతేనే బాగుంటుంది,’ అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అభిప్రాయపడ్డారు. 

అయితే, ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితి బాగా అధ్వాన్నంగా ఉంది. అయితే, అక్కడా చిరంజీవి వూసే వినిపించడం లేదు.  కాంగ్రెస్ పార్టీ పుణ్యాన కేంద్రం మంత్రి అయి దర్జా వెలగబెట్టిన చిరంజీవి కష్ట కాలంలో  పార్టీని ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడనే ఆశే లేదు.  చిరంజీవి అంధ్రకాంగ్రెస్  తరఫున క్యాంపెయిన్ చేస్తారా అని ఆంధ్రా కాంగ్రెస్ లో సీనియర్ అయిన ఒక కాపునాయకుడిని విచారిస్తే ‘ అబ్బే అలాంటిదేమీ లేదు,’ అని సమాధానమిచ్చారు.

2011 ఆగస్టు 20న అప్పటి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సమక్షంలో చిరంజీవి కాంగ్రెస్ లో చేరారు.

‘చిరంజీవి కాంగ్రెస్ ను ఎపుడో మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనను మర్చిపోతున్నది. ఆయనొక రాజకీయ నాయకుడని ప్రజలూ మర్చిపోతున్నారు. అలాంటపుడు ఆయన్ని రాజకీయాల్లోకి లాగినందున పార్టీకి ప్రయోజనం ఉండదు,’ ఆయన చెప్పారు.

చిరంజీవి కావాలనే కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగారని, కావాలనే ఆయనఎన్నికలపుడు సినిమాలలో బిజీ అవుతున్నారనే అనుమానం కూడా కాంగ్రెస్ నాయకుల్లో ఉంది. ఈ అనుమానం వ్యక్తం చేస్తూ, అలాంటి వ్యక్తి కాంగ్రెస్ కు ప్రచారమెలా చేస్తాడని ఆయన అన్నారు.

ఆయన మరొక ముఖ్యమయిన విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా చిరంజీవి పునరుద్దరించుకోలేదు. ఆయనెపుడూ పార్టీకి అందుబాటులో లేరు. ఎవరో ఒకరిద్దరు ఉన్నత స్థాయి నాయకులకు తప్ప ఆయన ఎపుడూ పార్టీ నేతలతో మాట్లాడటం గాని, పోన్ చేయడం గాని, ఫోన్ స్వీకరించడంగాని చేయలేదని కూడా ఆయన చెప్పారు.

‘ 2019 ఎన్నికల్లో  కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని పార్టీ ఢిల్లీ నాయకులు కొందరు చిరంజీవిని కోరినట్లు ఆంధ్రా కాంగ్రెస్ లో  చెప్పుకుంటున్నారు. దీనికి చిరంజీవి నుంచి స్పందన లేదని తెలిసింది. ఇదే నిజమయితే బాధాకరమయిన విషయం.’అని చెప్పారు.

ఏది ఏమయినా చిరంజీవి కావాలనే పార్టీ కి దూరంగా జరిగారనే అనుమానం రెండు రాష్ట్రాల కాంగ్రెస్ నేతల్లో ఉంది.  ఆంధ్రకు సంబంధించి బలమయిన కారణం, తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన తరఫున ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తుండటమే నని అనుకుంటున్నారు. ‘ఆయనెలాగు ముఖ్యమంత్రి కాలేకపోయాడు. తమ్ముడు పవన్ ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటపుడు తాను కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడం పవన్ ను అడ్డుకున్నట్లే అవుతుంది.  ప్రచారం చేసి తమ్ముడిని నొప్పించలేడు. ప్రచారం చేయకుండా కాంగ్రెస్ ను నొప్పించలేదు.అ ందువల్ల ఎవరినినొప్పించకుండా రాజకీయాలకు దూరంగా జరగడం మంచిందని ఆయన భావించినట్లున్నారు,’ అని కొందరు కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అందుకే  సైరా షూటింగ్ లో ఉండాలనుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

అయితే, చిరంజీవి రాజకీయాలనుంచి తప్పుకునేందుకు మరికొందరు ఇంకోరెండుకారణాలను కూడా చూపిస్తున్నారు. అవి: 1. తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు. తాను ప్రచారం చేసినా కాంగ్రెస్ ఓడిపోతే, తన పొలిటిక్ కరిష్మా తగ్గిపోయిందనే టాక్ వస్తుంది. అ ది తన సినిమాల మీద కూడా  దుష్ఫ్రభావం చూపించవచ్చు.  2. కాంగ్రెస్, టిడిపితో కలియడం చిరంజీవికి  ఏ  మాత్రం ఇష్టం లేదు. అందువల్ల ఆయన ఈఎన్నికల్లో తెలంగాణాలో గాని, ఆంధ్రలో గాని కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తే అది టిడిపికి ఉపయోగపడుతుంది. అలాంటి పని చేయడం ఇష్టం లేదు.  అందుకే ఆయన ప్రచారం చేయడం ఇష్టం లేక పార్టీకి దూరంగా జరిగారు.