ఫ్యాక్షన్ సినిమాలంటే గుర్తొచ్చేది రాయలసీమ…విజయవాడ ప్రాంతాలే. మీసం తిప్పాలన్నా…కత్తి పట్టి తెగనరకాలన్నా… తొడగొట్టి సవాల్ విసరాలన్నా సీమకే చెల్లిందని ఎన్నో చిత్రాలు చెప్పకనే చెప్పాయి. విజయవాడలో కుల రాజకీయాలు…సీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు అడ్డాగా మారాయని రాంగోపాల్ వర్మ తన సినిమాల ద్వారా చెప్పే ప్రయత్నం చేసాడు. ఇంకా బి. గోపాల్, వి. వి.వినాయక్…త్రివిక్రమ్ లాంటి వాళ్లు తమదైన శైలిలో సీమ ఫ్యాక్షనిజాన్ని ఎలివేట్ చేసారు. నటసింహ బాలకృష్ణకు సీమ ఫ్యాక్షనిజంలో చేసిన సినిమాలు హీరోగా ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టాయి.
అందుకే బాలయ్య కు సీమలో ప్రత్యేకమైన అభిమానులున్నారు. భారీ డైలాగులు చెప్పాలన్నా..ప్రత్యర్ధి ముందు తొడగొట్టాలన్నా.. కత్తిపట్టాలన్నా..బాంబు చుట్టాలన్నా పాత్ర పరంగా బాలయ్య ఒదిగిపోయినట్లు మరే నటుడు పరకాయ ప్రవేశం చేయలేరు. తజాఆగా అసెంబ్లీ సమావేశాల్లో వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి ఫ్యాక్షన్ సినిమాలు ఎలా పుట్టాయి? అన్న దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఫ్యాక్షన్ సినిమాలకు అసలు కారకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని…అతని వల్లే రాయలసీమ ఫ్యాక్షనిజం పతాక స్థాయికి చేరుకుందని ఆరోపించారు.
బాలయ్య బాబు ఫ్యాక్షన్ పాత్రలో ఒదిగిపోవడానికి తమ వియ్యంకుడి గైడన్స్ కూడా ఓ కారణం అంటూ అసెంబ్లీ సాక్షిగా ఎద్దేవా చేసారు. రచయితలు..దర్శకుల క్రియేటివిటీ వల్ల సీమ రక్తపాతం కాలేదని..చంద్రబాబు వల్లే సీమ రక్తపాతం అయిందని..అలాంటి కథలకు ఆద్యుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. మరి వ్యాఖ్యలపై బాబు గారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.