నారా చంద్రబాబు నాయుడు కోవిడ్ మూలంగా బయటకు రావడం పూర్తిగా తగ్గించేశారు. ఆయన వయసు 70 ఏళ్ళు. వైద్యులు 60ఏళ్ళు పైబడిన వ్యక్తులు ఇంట్లోనే ఉండాలని సూచించిన నేపథ్యంలో ఆయన హైదరాబాద్లోని నివాసానికే పరిమితమయ్యారు. పార్టీ ఎన్ని కష్టాల్లో ఉన్న అడుగు బయటపెట్టలేదు. అన్ని పనులను వీడియో కాన్ఫరెన్సుల ద్వారానే చేస్తూ వచ్చారు. దీంతో కేడర్లో కూడా అసహనం తలెత్తింది. అయినా బాబుగారు పట్టించుకోకుండా ఆరున్నర నెలలు ఇంట్లోనే గడిపారు. అయితే కరోనా ప్రభావం మెల్లగా తగ్గుతుందన్నసంకేతాలు కనిపించడంతో బయటికి రావడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ వదిలి ఉండవల్లిలో తన నివాసానికి వచ్చారు.
సుమారు వారం పాటు ప్లాన్ చేసుకున్న ఈ పర్యటనలో కొత్తగా నియమించిన పార్లమెంట్ ఇంఛార్జులను కలవడం, కీలక నేతలతో సమావేశం కావడం లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత అధినేత అందుబాటులోకి రావడంతో అన్ని జిల్లాల నేతలు ఆయన్ను కలవడానికి సిద్దపడ్డారు. కానీ ఈలోపే మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలడం చంద్రబాబును ఆందోళనలో పడేసింది. చిరు కూడ షూటింగ్లు, మీటింగ్లు మానేసి ఆరేడు నెలల నుండి ఇంట్లోనే ఉన్నారు. ఈమధ్యే బయటి కార్యక్రమాలను వెళుతున్నారు. రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రిని కలిశారు. అంతకుముందు ఒక పెళ్ళికి హాజరయ్యారు. ఆయనకు కరోనా అని తెలియడంతో ఆయన్ను కలిసిన వారంతా కంగారుపడుతున్నారు.
చంద్రబాబు నాయుడైతే ఇంట్లో ఉన్నన్ని రోజులూ భద్రంగానే ఉన్న చిరు బయటికి రావడం మూలానే కోవిడ్ బారిన పడ్డారని భావించి తన ప్లాన్స్ అన్నీ మార్చుకున్నారట. నేతలకు ఇచ్చిన అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఇంటికి ఎవరూ రావొద్దని సూచించినట్టు తెలుస్తోంది. విషయం ఏదైనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మాట్లాడుకోవాలని తెలిపారట. మొత్తానికి చాలా రోజుల తర్వాత బయటికొచ్చిన ఆయన్ను చిరు ఘటన మరింత కంగారుకు గురిచేసిందన్నమాట.