అక్కడ అమరావతి పేరెత్తితే ఔట్ అంతే

BJP didn't have proper plan to save Amaravathi farmers
అమరావతిని కాపాడాలని, రాజధాని తరలింపును అడ్డుకోవాలని, అది తమ బాధ్యతని చాలామంది ఇతర పార్టీల నేతలు, ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే.  కోర్టులో కూడా రాష్ట్ర రాజధాని కేంద్రం పరిధిలోని అంశమని, మోదీ, అమిత్ షా కలుగజేసుకోవాలని పిటిషన్లు కూడా పడ్డాయి.  కోర్టు ఉత్తర్వుల మేరకు స్పందించిన కేంద్రం రాష్ట్ర రాజధాని అనేది తమ పరిధిలోని అంశం కాదని, పూర్తిగా అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విషయమని, తాము కలుగజేసుకోలేమని తేల్చి చెప్పింది.  విభజన చట్టం మేరకు ఏపీకి ఇవ్వాల్సిన నిధులు ఇస్తున్నామని కూడా తెలిపారు.  దీంతో ఇక అమరావతి వివాదంలో బీజేపీ వేలు పెట్టదని రూఢీ అయిపోయింది.  మోదీ స్వయంగా అమరావతికి శంఖుస్థాపన చేశారు కాబట్టి ఏ క్షణమైనా మూడు రాజధానులకు అడ్డు చెప్పి జగన్ మనసు మార్చగలరని ఆశించిన వారందరికీ బీజేపీ క్లారిటీ ఆశాభంగాన్ని కలిగించింది. 
 
 
అంతేకాదు తమ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ మారదని గట్టిగా సంకేతాలిస్తోంది.  కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్రం చెప్పినట్టు అమరావతి విషయంలో బీజేపీ అగ్ర నాయకత్వం ఏమీ చేయలేదని అంటూనే రైతుల తరపున తాము నిలబడతామని, వారికి న్యాయం జరిగేలా చూస్తామని ప్రకటించారు.  కానీ అదెలాగో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.  వీర్రాజుగారు చెప్పిన ఈ విధానం జనాలకే కాదు బీజేపీ నేతలకు కూడా అర్థం కాలేదు.  అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక ఏదోలా స్పందిస్తూ పార్టీ ఆగ్రహానికి గురవుతున్నారు.  తాజాగా భాజాపా అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలక్రిష్ణ ఇలాగే బలయ్యారు.  నిన్న శనివారం రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన వైఎస్ జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.  
 
 
అంతేకాదు రాజధాని తరలింపుకు తాను పూర్తిగా వ్యతిరేకమని అంటూ, ఈరోజు రైతుల తరపున పోరాడలేకపోతున్నందుకు చెప్పుతో కొట్టుకోవాల్సి వస్తోంది అంటూ తన చెప్పుతో తానే కొట్టుకున్నారు.  ఆయన మాటల్ని బట్టి అమరావతి విషయంలో అగ్రనాయకత్వం తీసుకున్న స్టాండ్ ఆయనకు నచ్చలేదని స్పష్టంగా అర్థమైంది.  అంతేకాదు గతంలో తాను పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఇచ్చిన స్థలాన్ని విక్రయించి రైతుల పోరాటం కోసం వెచ్చిస్తానని అన్నారు.  ఈ వ్యవహారం మీడియాలో బాగా హైలెట్ అయింది.  దీంతో బీజేపీ అగ్ర నేతలకు ఆగ్రహం కలిగింది.  తాము అమరావతి విషయంలో కలుగజేసుకోమని అంటే ఇలా రైతులకు మద్దతిస్తూ పరోక్షంగా తమపైనే విమర్శలు చేసి పార్టీ విధానాన్ని ధిక్కరిస్తారా అంటూ గోపాలక్రిష్ణను పార్టీ నుండి నిర్థాక్షిణ్యంగా బహిష్కరించేశారు.  
 
 
బహిష్కరణ లేఖలో ‘అమరావతి సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవు.  రాష్ట్ర రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదని పార్టీ అధికారికంగా తెలిపింది.  కానీ పార్టీ అభిప్రాయానికి మీ ప్రకటనలు పూర్తిగా వ్యతిరేకం.  భాజాపా రైతుల పక్షాన నిలబడటం లేదని మీరు చేసిన ఆరోపణ నిరాధారమైనది.  పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మీ వ్యాఖ్యలు ఉన్నాయి.  అనేక వార్తాపత్రికలు మరియు టెలివిజన్ ఛానెల్స్ మీ తప్పుడు ఆరోపణలకు విస్తృత ప్రచారం ఇచ్చాయి.  పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అధ్యక్షుల సూచనల మేరకు మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం’ అంటూ వివరణ ఇచ్చారు.  దీన్నిబట్టి పార్టీలో ఎవరైనా అమరావతి తరపున పోరాటానికి దిగితే వేటు తప్పదని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్ఛేశారు సోము వీర్రాజుగారు.  
 
 
గతంలో కూడా అమరావతికి మద్దతిస్తూ లేఖ రాసినందుకే కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్ష పదవి నుండి దింపేసి సోము వీర్రాజును కూర్చోబెట్టారు.  ఈ చర్యలన్నీ చూస్తే అమరావతి గురించి పోరాటం చేయాలనుకునేవారు బీజేపీ ఏదో చేస్తుందని, సీఎంను ఆపుతుందని ఆశలు పెట్టుకోవడం వృథా ప్రయాసేనని తేట తెల్లమైంది.  రాజధాని మార్పును ఆపరు కానీ రైతుల కోసం పోరాడతాం అనే వారి రెండు నాల్కల మాటల్లో క్లారిటీ లేదు.  అసలు కార్యాచరణ ఏమిటో ఇప్పటికీ బయటపెట్టలేదు.  ఈ పరిణామాలన్నీ చూశాక ఏదో టైమ్ పాస్ కోసమే బీజేపీ బింకం ప్రదర్శిస్తోంది తప్ప నిజంగా రైతులకు న్యాయం జరిగేలా చూసే ఉద్దేశ్యం వారికి లేదని, అసలు సమస్య మీద ఎలా ముందుకెళ్లాలో వారికే స్పష్టత లేదని అనిపిస్తోంది.