జేసీ దివాకర్ రెడ్డికి పోలీసుల నుండి ఊహించని బిగ్ షాక్

టిడిపి నేత, అనంతపూర్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసులు తీవ్రంగా మండి పడుతున్నారు. తాడిపత్రి ఘర్షణ నేపథ్యంలో పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన జేసీ పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. జేసీ చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు పోలీసు అధికారులు. దీనిపై పూర్తి వివరాలు కింద ఉన్నాయి చదవండి.

తాడిపత్రిలో ప్రబోధానంద స్వామిజి ఆశ్రమవాసులకు, గ్రామస్థులకు మధ్య వినాయక నిమజ్జనం విషయంలో ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణ తారాస్థాయికి చేరుకొని గ్రామస్తుల్లో ఒకరి మరణానికి కారణమైంది. ఆశ్రమం వర్గాలు గ్రామస్తులపై రాళ్లతో దాడికి దిగారు. పోలీసులు ఆ గొడవను క్లియర్ చేయటానికి నానా తిప్పలు పడ్డారు. అయితే తాడిపత్రిలో జేసీ వర్గానికి, ప్రబోధానంద వర్గానికి కొంతకాలంగా గొడవలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి ఆశ్రమానికి వ్యతిరేకంగా ఆశ్రమం దగ్గర ఆందోళన చేపట్టారు. పోలీసులు జేసీని జీపులో ఎక్కించుకుని స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన జేసీ దివాకర్ తనదైన శైలిలో పోలీసులపై విరుచుకు పడ్డారు. ఆశ్రమం లోని భక్తులు గ్రామస్తులపై రాళ్ళ దాడి చేస్తుంటే ఒక్క పోలీసు కూడా అడ్డుకోవడానికి ముందుకు రాలేదని అన్నారు.

ఎస్పీ నుండి ఎస్సై వరకు దాడి జరుగుతుంటే ముందే పారిపోయారంటూ ఎద్దేవా చేసారు. తాడిపత్రిలో పోలీసుల కంటే హిజ్రాలే నయమని, ఆశ్రమం నుండి దాడి చేస్తుంటే అడ్డుకునేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ లో మగాళ్లే లేరా అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

జేసీ దివాకర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై హిజ్రాలు కన్నెర్ర జేశారు. జేసీకి ఊహించని ఝలక్ ఇచ్చారు. విజయవాడలో జేసీ కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తక్షణమే ఆయన బహిరంగంగా హిజ్రాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం తమ వద్దకు వచ్చే టీడీపీ నేతలు తిట్ల కోసం తమని అవమానిస్తున్నారంటూ హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన జేసీ తప్పుని ఒప్పుకుని వెంటనే క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు హిజ్రాలు. గతంలో చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ హిజ్రా గెటప్ వేసి హిజ్రాల ఆగ్రహానికి గురైన విషయం విదితమే. ఇప్పుడు జేసీ కూడా వారి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటంతో టీడీపీ నేతలపై హిజ్రాలు గుర్రుగా ఉన్నారు.

ఇదిలా ఉండగా గురువారం పోలీసు శాఖ సైతం జేసీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు కురిపిస్తోంది. జేసీ చేసిన వ్యాఖ్యలు మొత్తం పోలీసు వ్యవస్థనే కించపరిచేలా ఉన్నాయంటూ సీఐ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. మాది కూడా రాయలసీమే, మేము కూడా అసభ్య పదజాలంతో మాట్లాడగలం. రాజకీయ నాయకుల కొమ్ము కాయడానికి పోలీసు వృత్తిలోకి రాలేదు. జేసీ దివాకర్ రెడ్డి పోలీసు శాఖకు క్షమాపణలు చెప్పాలంటూ సీఐ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు.

పోలీసు అధికారుల సంఘం కూడా ఇప్పటికే జేసీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్య పదజాలంతో జేసీ దివాకర్ రెడ్డి పోలీసు శాఖను కించపరిచారు. ఆయన క్షమాపణలు చెప్పాలి అంటూ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు ఎక్కడ బాగుంటే అక్కడ అభివృద్ధి ఉంటుందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు దివాకర్ రెడ్డి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరామని శ్రీనివాసరావు తెలిపారు.