అఖిల‌ప్రియ యవ్వారాలు అన్నీ ఇన్నీ కాదయా!

లోకేశ్ పాద‌యాత్రలో టీడీపీ సీనియ‌ర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌ చార్జ్ అఖిల‌ప్రియ నేతృత్వంలో దాడి జ‌రిగింది. లోకేశ్ పాద‌యాత్ర 101వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా నంద్యాల‌ – ఆత్మకూరు రోడ్డులో లోకేశ్ పాద‌యాత్ర సాగుతుండ‌గా.. ఒక్కసారిగా ఏవీ సుబ్బారెడ్డి, ఆయ‌న అనుచ‌రుల‌పై.. అఖిల‌ప్రియ‌, ఆమె భ‌ర్త భ‌ర్త భార్గవ్ రాం, త‌మ్ముడు విఖ్యాత్‌, హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన కొంతమంది అనుచ‌రులు భౌతిక‌దాడికి తెగ‌బ‌డ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి నోటి నుంచి ర‌క్తం కార‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో… అఖిల‌ప్రియ‌ను నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు.

దీంతో… అఖిల ప్రియ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… ఇప్పటివరకూ ఆమె చేసిన దౌర్జన్యాలు, దారుణాలు, అరాచకాలు మరోసారి బహిర్గతం అవుతున్నాయి.. ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయి. వాటిలో కొన్ని సంగతులు ఇప్పుడు చూద్దాం.

ఏవీ సుబ్బారెడ్డిపై హత్యకు అఖిల‌ప్రియ భ‌ర్త భార్గవ్ రాం గతంలో ఒక ప‌థ‌కం వేశార‌ని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని క‌డ‌ప పోలీసులు ఛేదించారు. అప్పట్లోనే అఖిల‌ప్రియ భ‌ర్త‌, అత‌ని స్నేహితుడు గుంటూరు శీనుపై పోలీసులు కేసు న‌మోదుచేశారు. ఈ కేసులో ప‌లుమార్లు అఖిల‌ప్రియ‌తో నిందితులు ఫోన్లో మాట్లాడిన‌ట్టు పోలీసులు బ‌య‌ట‌పెట్టారు.

హైద‌రాబాద్‌ లో ఆస్తుల గొడ‌వ‌ల్లో ఏకంగా ఇన్‌ క‌మ్‌ ట్యాక్స్ అధికారుల వేష‌ధార‌ణ‌లో హైకోర్టు లాయర్లనే కిడ్నాప్ చేసి, భ‌య‌పెట్టి సంత‌కాలు చేయించుకున్న ఘ‌ట‌న‌లో అఖిల‌ప్రియ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో అఖిల ప్రియ జైలు జీవితం కూడా గడిపారు.

ఆళ్లగడ్డలో వార‌సుల భూవ్యవహారాల్లో కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించడంతోపాటు… ఫోర్జరీ సంత‌కాలు సైతం చేయించారని… అఖిల‌ప్రియ‌, ఆమె భ‌ర్త భార్గవ్ రాం, త‌మ్ముడు జ‌గ‌త్‌ విఖ్యాత్ లపై బలమైన ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పటికీ ఈ విషయం ఆళ్లగడ్డలో హాట్ టాపిక్ గానే ఉంది.

ఇదే క్రమంలో… ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌ చార్జ్ భూమా కిశోర్‌ రెడ్డి త‌న చిన్నాన్న చిన్నమ్మ అయిన అఖిల ప్రియ తల్లితండ్రులు.. భూమా నాగిరెడ్డి, శోభ‌మ్మ విగ్రహాలను సొంత ఖర్చుల‌తో ఏర్పాటు చేశారు. అనంతరం వాటిని ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉంచుకోగా.. ఆహ్వానం లేకుండానే అఖిల‌ప్రియ త‌న మందీమార్భలంతో వెళ్లి ఓపెనింగ్ చేసేశారు.

ఇవన్నీ చూస్తుంటే… ఇలాంటివి సినిమాల్లోనే సాధ్యం కదా అనే అనుమానం కలిగినా అతిశయోక్తి కాదు. కారణం… అఖిల ప్రియ వ్యవహారాలు ఆళ్లగడ్డ, హైదరబాద్, బెంగళూరు అని తేడాలేమీ లేకుండా అవిరామంగా సాగుతుంటాయి. ఇందులో భాగంగా… ఇప్పుడు ఏకంగా తన సొంత పార్టీ సీనియర్ నేత, తన తండ్రికి రైట్ హ్యాండ్ గా ఉన్న వ్యక్తిపై రక్తం వచ్చేలా దాడికి తెగబడిన పరిస్థితి. ఫలితంగా… అఖిల‌ప్రియ అంటే కిడ్నాప్‌లు, హ‌త్యాయ‌త్నాలు, దౌర్జన్యాలు, భూఆక్రమణలు చేసే నాయ‌కురాలిగా ప్రజలు గుర్తించుకునే పరిస్థితి!