వాలంటైన్స్ డే సందర్భంగా మేడ్చల్ జిల్లా కండ్లకోయ పార్కులో ఓ ప్రేమ జంటకు భజరంగ్ దళ్ కార్యకర్తలు బలవంతంగా ఓ జంటకు పెళ్లి చేశారు. దీంతో ఆ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
కండ్లకోయ దగ్గర్లోని ఓ కాలేజిలో ఆ అమ్మాయి బిటెక్ చదువుతోంది. అయితే ఉదయం కాలేజి దగ్గర అమ్మాయి తండ్రి దించి వెళ్లాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి తమ సమీప బంధువైన రాకేష్ తో కలిసి ఆక్సిజన్ పార్క్ కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన భజరంగ్ దళ్ కార్యకర్తలు వారికి బలవంతంగా వివాహం చేశారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది క్షణాల్లోనే వైరల్ అయ్యింది. దీనిని చూసిన అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
అయితే పెళ్లి తర్వాత భయపడిన ఆ జంట భయపడి ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఇప్పటి వరకు వారి ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే గురువారం రాత్రి ఏకంగాం అమ్మాయి అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుందని సోషల్ మీడియాలో కొంత మంది వైరల్ చేశారు. అమ్మాయికి రిప్ అంటూ ఫేస్ బుక్, వాట్సాప్ లలో వైరల్ చేశారు. వారు బతికే ఉన్నారని, ప్రస్తుతం వారు కుటుంబానికి భయపడి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. వారి సమాచారం పోలీసులకు తెలిసినట్టుగా తెలుస్తోంది.
అయితే మరో సంఘటన నల్లగొండ పానగల్ చెర్వు కట్ట పై జరిగింది. ప్రేమ జంటను ఏకంగా ఆర్ ఎస్ ఎస్ , భజరంగ్ దళ్ సభ్యులు కొట్టి తిట్టారు. అవమానకరంగా మాట్లాడారు. దీని పై నల్లగొండ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. భజరంగ్ దళ్ కార్యకర్తల పై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని డిసిపి పద్మజ తెలిపారు.
పోలీసుల విచారణలో భజరంగ్ దళ్ కార్యకర్తలు చెప్పిన విషయం విని ఆశ్చర్య పోయారు. సోషల్ మీడియాలో మరియు టివిలలో రావడానికే అలా చేశామని వారు చెప్పటం కొసమెరుపు. ఏదేమైనా ఈ సంఘటనల పై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రవర్తించే హక్కు ఎవరికి లేదని వారన్నారు.