టీడీపీకి ఉన్న పంచప్రాణల్లో… ఒకటి ఆంధ్రజ్యోతి అని చెప్పినా అతిశయోక్తి కాదు! ఏమాత్రం వెనకా ముందూ కూడా చూడకుండా.. జనం ఏమైనా అనుకుంటారేమో అని కూడా ఆలోచించకుండా.. టీడీపీ కోసం ఎంతకైనా దిగజారగలదనే కామెంట్లను సొంతం కూడా చేసుకుందని చెబుతుంటారు. అలాంటి ఆంధ్రజ్యోతి తో బాలయ్యకు చెడింది!
అవును… తెలుగుదేశం మానస పుత్రిక అయిన ఆంధ్రజ్యోతి కి, అదే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి కుమారుడు, అదే పార్టీ ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణకి బాగా చెడిందంట! అందుకు కారణం… బాలయ్యని ఆంధ్రజ్యోతి బ్యాన్ చేసిందంట. అందుకే గత కొంతకాలంగా జ్యోతి సినిమా పేజీ “చిత్ర జ్యోతి” లో బాలయ్య సినిమాల కవరేజీ ఉండటం లేదట!
దానికి కారణం… ఓ సినిమా కవరేజీ విషయంలో ఆంధ్రజ్యోతిపై బాలయ్య విరుచుకుపడ్డారని.. వెంటనే ఆగ్రహంతో వేమూరి రాధాకృష్ణకి కాల్ చేసి ఫోన్‌లోనే తిట్టిపోశారని తెలుస్తోంది. దీంతో పౌరుషంగా తీసుకున్న ఆర్కే… ఇక నుంచి బాలయ్య సినిమాల్ని అస్సలు కవర్ చేయకూడదన్న నిర్ణయం తీసుకొన్నారట! నాటి నుంచి బాలయ్య ఫొటోగానీ, పేరు కానీ సినిమా పేజీలో కనిపించడం లేదని తెలుస్తోంది.
“అదేంటి… ఈ మధ్య జ్యోతిలో బాలయ్య సినిమా ఫోటోలు చూశామే” అంటారా? అది న్యూస్ కాదు.. ప్రకటనలు (యాడ్స్) అంట! ఎందుకంటే అది ఆదాయం.. సో, కాసేపు తన పౌరుషాన్ని పక్కనపెట్టిన ఆర్కే.. ఆ యాడ్స్ ని మాత్రం వదులు కోవడానికి ఇష్టపడడం లేదట.
మరో విచిత్రం ఏమిటంటే… బాలయ్య ని ఆంధ్ర్యజ్యోతి బ్యాన్ చేసినా… ఏబీన్ న్యూస్ ఛానల్ లోనూ, ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ లోనూ మాత్రం బాలయ్య వార్తలు కవర్ అవుతూనే ఉన్నాయి. దీంతో… “ఇదేం లెక్క నాయనా? జ్యోతి వేరు – ఏబీఎన్ వేరా? రాధాకృష్ణ కు చాలా పౌరుషం ఉంది కానీ.. కండిషన్స్ అప్లై” అన్నమాట అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!