ఏపీ బీజేపీ రాజ్యసభ సభ్యుడి ఇంట తీవ్ర విషాదం

ఆంధ్రప్రదేశ్ కి చెందిన బీజేపీ రాజ్య సభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఎలమంచిలి జనార్దన్ రావు ఈ తెల్లవారుజామున కన్నుమూశారు.

ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ విస్పర్ వ్యాలీలోని వైకుంఠ మహాప్రస్థానంలో శనివారం ఉదయం 11.45కు జరుగనున్నాయి. జనార్ధనరావు మరణంపై బీజేపీ నేతలు, ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. జనార్ధనరావుకి భార్య సుశీల, నలుగురు కుమారులు, ఒక కుమార్తె.. ఎంపీ సుజనా చౌదరి వారి చిన్నకుమారుడు.

యలమంచిలి జనార్ధనరావు కృష్ణా జిల్లా దోసపాడులో 1932 జనవరి 9న జన్మించారు. కోయంబత్తూరులోని పిఎస్జీ కాలేజి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. అనంతరం 1955లో సాగునీటిశాఖలో జూనియర్ ఇంజనీర్‌గా చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ లో స్పెషల్ ఇంజినీర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.

ఇక జనార్దన్ రావు వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. ఆయన అనారోగ్య కారణాలతో మరణించినట్లు చెబుతున్నారు. గతంలో తెలుగుదేశం తరఫున కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన సుజనాచౌదరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయ్యాక బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బిజెపి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.. కృష్ణా జిల్లా కంచికచర్ల కు చెందిన సుజనా చౌదరి అనేక వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి పెద్ద స్థాయికి ఎదిగారు.