ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమూల్ ప్రాజెక్ట్ చుట్టూ చాలా హంగామా చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో పాల సిరులు కురుస్తాయని వైఎస్ జగన్ ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతోంది. పాడి రైతులకు స్వర్ణయుగంగా ఈ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివర్ణిస్తున్నారు. రాష్ట్రంలో నిన్న మొన్నటిదాకా హెరిటేజ్‌తోపాటు ఇతర ప్రైవేటు డైరీల నిర్వాకాన్ని శాసన సభ వేదికగా అధికార పార్టీ కడిగి పారేసింది. అధికార పార్టీ చేస్తున్న ప్రచారంలో కొంత వాస్తవం లేకపోలేదు. అయితే, గుజరాత్‌కి చెందిన అమూల్‌ని, రాష్ట్రం నెత్తిన రుద్దడం ద్వారా, రాష్ట్రానికి ఎంతవరకు లాభం.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.
ప్రైవేటు సంస్థ, ప్రజల కోసం పనిచేస్తుందా.?
ఏ ప్రైవేటు సంస్థ కూడా ప్రజల కోసం పనిచెయ్యదు. ప్రజల్ని ఉద్ధరించడానికి ఏ ప్రైవేటు సంస్థ కూడా నడుం బిగించదు. మరి, అలాంటప్పుడు డైరీ రంగంలోకి ప్రైవేటు సంస్థను తీసుకురావడం ఎంతవరకు సబబు.? రాష్ట్రానికి విజయ డెయిరీ వుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. దాన్ని సక్రమ మార్గంలో నడిపితే, అమూల్ సంస్థ అవసరమే వుండదు. కానీ, విజయ డెయిరీని పక్కన పడేసి, అమూల్ సంస్థకు ‘పెత్తనం’ అప్పగించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వ వాదన మాత్రం మరోలా వుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమూల్ సంస్థ ద్వారానే పాడి రైతులకు లబ్ది చేకూరుతుందన్నది ప్రభుత్వం చెబుతున్న మాట.
లాభం ప్రజలకా.? అమూల్ సంస్థకా.?
రాష్ట్రంలో పాడి రైతులకు పది రూపాయల లాభం వస్తే, అమూల్ సంస్థకు పాతిక రూపాయల లాభం వస్తేనే.. ఆ సంస్థ ఈ ప్రాజెక్టుకి ఒప్పుకుంటుందన్నది సర్వత్రా విన్పిస్తోన్న అభిప్రాయం. ఇందులోనూ కొంత నిజం లేకపోలేదు. ఏ ప్రైవేటు సంస్థ అయినా, లాభాల చుట్టూనే వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది తప్ప.. తమ లాభాల్ని తగ్గించుకుని, ఏ ప్రభుత్వం కోసమూ ప్రజల్ని ఉద్ధరించే కార్యక్రమమే చెయ్యదు. చంద్రబాబు హయాంలో హెరిటేజ్ డెయిరీ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలువురు టీడీపీ నేతలు డెయిరీలు నిర్వహించారు.. లాభాల బాట పట్టారు.
ప్రభుత్వ పెద్దలు అలా.. ప్రైవేటు ఇంకెలా.?
ప్రభుత్వంలో వున్నవారి డెయిరీలే.. ప్రభుత్వ రంగ డెయిరీలను తొక్కేసినప్పుడు.. ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన సంస్థ.. రాష్ట్రంలో పాడి రైతుల్ని ఇంకెంతలా నాశనం చేస్తుంది.? అన్నది విపక్షాల వాదన. సమాధానం చెప్పాల్సిన అధికార పక్షం, విపక్షాలపై ఎదురుదాడికి దిగుతోన్న దరిమిలా.. ఈ వ్యవహారం రాష్ట్రంలో పాడి పరిశ్రమపై ఎలాంటి తీవ్ర ప్రభావం చూపనుందో వేచి చూడాల్సిందే.