టిడిపికి భారీ షాక్: ప్రొద్దుటూరు టిడిపి నేతల మూకుమ్మడి రాజీనామా

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆధిపత్య పోరు రగులుకుంది. ప్రొద్దుటూరు టీడీపీలో వర్గ పోరు భగ్గుమంది. వరదరాజులు రెడ్డి ఆధిపత్యాన్ని సహించలేని లింగారెడ్డి వర్గీయులు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి మూకుమ్మడిగా రాజీనామా చేసారు. రాజీనామా చేసిన వారిలో 23 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు ఉన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముక్తియార్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టిన వీరు మున్సిపల్ కమిషనర్ కు రాజీనామాలు సమర్పించారు.

కొంతకాలంగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిపై వరదరాజులు రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కౌన్సిలర్ల రాజీనామా వ్యవహారం తెరపైకి వచ్చింది. ప్రొద్దుటూరు పురపాలికలో మొత్తం 40 మంది కౌన్సిలర్లు, ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు ఉన్నారు. వైసీపీలో 9 మంది, ముక్తియార్ వర్గంలో 22 మంది వరద రాజుల రెడ్డి తరపున 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాగా కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు మూకుమ్మడి రాజీనామా చేయడానికి గల కారణాలను సదరు నేతలు మీడియాతో తెలిపారు. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.

వరదరాజులు రెడ్డి టిడిపి ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకుని అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నారు. మున్సిపల్ మీటింగ్ ఉన్న రోజు మేమంతా ఆఫీసులలో ఉంటే… ఆరోజు వరదరాజులు రెడ్డి టిడిపి వార్డులలో తిరుగుతూ అధికారులను పిలిపించుకుని ఆ వార్డులలో అధికారులతో సమీక్షా సమావేశం పెట్టారు. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు. టిడిపి కౌన్సిలర్లు ఉన్నచోటనే ఆయన ఇంకొకరిని టిడిపి తరపున ఇంచార్జిగా పెట్టడం కౌన్సిలర్లను అవమాన పరిచేలా ఉంది.

ఆయన 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి, 10 సంవత్సరాలు అధికార పార్టీ ఇంచార్జి గా ఉండి ప్రొద్దుటూరులో చెప్పుకోదగిన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదన్నారు. అందుకే మేము మూకుమ్మడిగా రాజీనామా చేసాము. 23 మంది రాజీనామాలతో ఆయన తీరు గురించి అధిష్టానానికి తెలిసేలా చేయాలి అనుకున్నాము. వరద రాజులు రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మేము రాజీనామా చేస్తున్నాము అన్నారు.