లోకేష్ మేక్ ఓవర్.. టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం, కండిషన్స్ అప్లయ్.!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఈ మధ్య రూటు మార్చారు. సరికొత్త మేకోవర్ చూపిస్తున్నారు ఎప్పటికప్పుడు. మాట తీరులోనూ ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తున్నారాయన. కరోనా నేపథ్యంలో అడపా దడపా మాత్రమే నారా లోకేష్ జనాల్లోకి వెళ్ళడం జరుగుతోంది. దాంతో, ఎప్పటికప్పుడు ఆయన సరికొత్త మేకోవర్ సంతరించుకుంటుండడం గమనార్హం. నారా లోకేష్ ప్రతిసారీ కొత్తగా కనిపిస్తున్నారనీ, ఆయన మాట తీరులో చాలా మార్పు వచ్చిందనీ, పార్టీకి లోకేష్ కొత్త మేకోవర్ చాలా బాగా ఉపయోగపడుతుందని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.

అయితే, తెలుగుదేశం పార్టీ పరిస్థితి మాత్రం రాష్ట్రంలో నానాటికీ దిగజారిపోతోంది. టీడీపీలో మెజార్టీ నేతలు, అధినాయకత్వంపై నమ్మకం కోల్పోయారు. ఎప్పుడు టీడీపీలో ఎవరు వికెట్ పడిపోతుందో తెలియని పరిస్థితి. ఆయా సందర్భాల్లో లోకేష్ పర్యటనలు అప్పటికప్పుడు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం చూపిస్తున్నా, ఆ తర్వాత సీన్ రివర్స్ అయిపోతోంది. ప్రధానంగా టీడీపీలో చాలామంది సీనియర్ నేతలకు, నారా లోకేష్ తీరు అస్సలు నచ్చడంలేదు. పైకి లోకేష్ కనిపించే తీరుకీ, తెరవెనుకాల ఆయన ఆటిట్యూడ్‌కీ అస్సలేమాత్రం పొంతన వుండదనీ, అదే సీనియర్లను టీడీపీకి దూరం చేస్తోందనీ టీడీపీ కార్యకర్తల్లోనే బలమైన అభిప్రాయం.. ఇంకా బలంగా నాటుకుపోయింది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని బలోపేతం చేయాలనుకుంటే, నారా లోకేష్ చాలా చాలా మారాలి. కానీ, లోకేష్‌లో కనిపిస్తున్న మార్పులేవీ, పార్టీని బాగు చేసేలా కనిపించడంలేదు. ఇంకోపక్క చంద్రబాబు, వృద్ధాప్యం కారణంగా ఇదివరకటి జోష్ చూపించలేకపోతున్న సంగతి తెలిసిందే.