రోడ్డున పడిన అధికారపార్టీ ఎంఎల్ఏల రచ్చ

ఇపుడిదే అంశంపై అధికారపార్టీలో చర్చలు జరుగుతోంది. అధికార వైసిపిలోని ప్రజా ప్రతినిధుల మధ్య కొన్ని జిల్లాల్లో విభేదాలున్న మాట వాస్తవం. కానీ అవన్నీ లో ప్రొఫైల్ లోనే ఉన్నాయి ఇంకా. కొన్ని జిల్లాల్లో మంత్రులకు సీనియర్ ఎంఎల్ఏలకు పడటం లేదు. కొన్ని జిల్లాల్లో మంత్రులకు ఉప ముఖ్యమంత్రులకు పడటం లేదు. ఇలాంటి అంతర్గత గొడవలు రాజకీయా పార్టీల్లో మామూలే.

అయితే అంతర్గతంగా ఉండాల్సిన విభేదాలు రోడ్డున పడినపుడు రచ్చ మొదలవుతుంది. ఇపు వైసిపిలో జరిగిందిదే. గుంటూరు జిల్లాలోని ఇద్దరు లేడీ ఎంఎల్ఏల మధ్య విభేదాలు అధికారంలోకి వచ్చిన మూడోనెలలోనే  రచ్చకెక్కి రోడ్డున పడటమే ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా ఏ ఇద్దరి మధ్య విభేదాలకు  ఆధిపత్యం గొడవలే ప్రధాన కారణమవుతాయి. కానీ ఈ ఇద్దరి ఎంఎల్ఏల మధ్య గొడవకు ఓ సంక్షేమ కార్యక్రమమే కారణం కావటం విచిత్రంగా ఉంది.

ఇంతకీ జరిగిందేమిటంటే తాడికొండ నియోజకవర్గంలోని తురకపల్లి గ్రామంలో మశీదు నిర్మించాలని అనుకున్నారు. శంకుస్ధాపనకు స్ధానిక ఎంఎల్ఏ డాక్టర్ శ్రీదేవిని ఆహ్వానించారు గ్రామస్తులు. అదే సమయంలో నిర్మించబోయే మశీదుకు ఆర్ధిక వనరులను సమకూరుస్తున్నది చిలకలూరిపేట నియోజకవర్గంలోని హూడా వెల్ఫేర్ సొసైటి. కాబట్టి సొసైటి బాధ్యులు తమ ఎంఎల్ఏ విడదల రజనిని ఆహ్వానించారు.

అంటే ఒకే కార్యక్రమానికి ఇద్దరు ఎంఎల్ఏలు హాజరయ్యారన్నమాట. ఎవరికి వారుగా తమ ఎంఎల్ఏలను ఆహ్వానించిన సొసైటి-గ్రామస్తుల మధ్య సమన్వయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరి మధ్య ఇగో సమస్యలు ఇప్పటికే ఉన్నందున రచ్చ కాస్త బయటపడింది.

రజని రావటాన్ని ఇష్టపడని శ్రీదేవి అవమానంతో కార్యక్రమం మధ్యలోనే వెళ్ళిపోయారు. దాంతో కార్యక్రమం చివరి వరకూ ఉన్న రజని కూడా తీవ్ర అసహనంతో శంకుస్ధాపన చేయకుండానే వెళ్ళిపోయారు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు రోడ్డున పడినట్లైంది.