అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు మున్నెన్నడు జరగ లేదంటున్నారు. ఇదే ప్రధమం అంటున్నారు.

కేంద్రంలోనూ వివిధ రాష్ట్రాలోనూ ఎన్నో పార్టీలు అధికారం చలాయించి తిరిగి ఓడిపోతే మరో పార్టీ అధికారం చేపట్టిన సందర్భాలు వున్నాయి. కాని ఈ తరహాలో విచారణ జరిగిన ఉదాహరణ లేదు. అంతెందుకు? 2004 లో చంద్రబాబు నాయుడు ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన కొన్ని అంశాలపై విచారణలు జరిగాయి. కాని హోల్ సేల్ గా అయిదు ఏళ్ల పాలనపై డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కూడా విచారణకు సిద్ధం కాలేదు. అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి పాలనపై టిడిపి ఘాటైన విమర్శలు చేసింది. అనంతరం చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణలో కెసిఆర్ అధికారంలోనికి వచ్చి ఈలాంటి తరహా విచారణ చేపట్ట లేదు. కాని డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం తప్పో ఒప్పో పక్కన బెడితే భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విచారణకు శ్రీకారం చుట్టారు. ఇది అపూర్వం. రాజకీయాల్లో తలలు పండిన వారు రాజ్యాంగ నిపుణులు కూడా ఒకింత ఆశ్చర్య పోయే విధంగా ఈ ఆదేశాలు వున్నాయి.

విచారణకు ఆదేశించిన అంశాలు సాదా సీదా కాదు. ఒక్క ఏడాది లేక రెండు సంవత్సరాలు కాదు అయిదు ఏళ్లు ప్రభుత్వ పరంగా సచివాలయం స్థాయిలో తీసుకున్న నిర్ణయాలే కాకుండా మంత్రి వర్గ స్థాయిలో నిర్ణయాలు తీసుకొని అమలు జరిపిన అంశాలపై సిట్ విచారణ జరపడం సాధ్యమా? .

సిట్ కు ఇచ్చిన అంశాలు అధికారాలు పరిశీలించితే అవసరం లేదా అనుమానం వున్న ఎవరినైనా పిలిచి విచారించే అధికారం కట్ట బెట్టారు. ఈ అయిదు ఏళ్లలో ఎంతో మంది ఐఎయస్ ఐపియస్ అధికారులు పని చేసి వెళ్లి వుంటారు. వారు ఎక్కడ వున్నా పిలిపించి విచారించే అధికారం కట్టబెట్టారు. న్యాయ పరమైన చిక్కులు రాకుండేందుకు కాబోలు సిట్ కు పోలీసు స్టేషన్ స్తాయి కల్పించారు. ఆ
మేరకు ఆలోచించితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పోలీసు స్టేషన్ కు పిలిపించవచ్చు.

అంతేకాదు పది మంది పోలీసు అధికారుల బృందం అయిదు ఏళ్ల పాటు సాగిన ప్రభుత్వ కార్యకలాపాలు గెకొన్న నిర్ణయాలు జారీ చేసిన ఆదేశాలు పరిశీలించడం తప్ఫొప్పులు నిర్థారించడం ఎంత వరకు సాధ్యం? ఎంతో ప్రావీణ్యం గల సిబిఐ కూడా నిర్దిష్ట మైన అంశాలను మాత్రమే విచారిస్తోంది. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కూడా నిర్దిష్టమైన అంశాలను విచారణ చేసింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు మంత్రి వర్గ ఉపసంఘం నిగ్గు తేల్చిన నిర్దిష్టమైన అంశాలు విచారణకు ఆదేశించి వుంటే విచారణ చేసే అధికారులకు ఇబ్బంది వుండేది కాదు. విచారణ సులువుగా వుండేది.ఆలా కాకుండా అయిదు ఏళ్ల పాలనపై విచారణ అంటే ద్వేష భావంతో వేశారనే అపవాదు వచ్చేందుకు ఆస్కారమేర్ఫడింది