మోసం చేసాడంటూ బన్ని వాసుపై ఆరోపణ
ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనని మోసం చేశాడంటూ ఓ మహిళ రోడ్డెక్కింది. సునీత అనే జూనియర్ ఆర్టిస్టు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ధర్నాకి దిగింది. గొలుసులతో తనని తాను బంధించుకుని, మంగళవారం రాత్రంతా వినూత్నమైన నిరసన తెలిపింది. జనసేన పార్టీ కోసం తాను కష్టపడ్డానని, ఆ సమయంలో బన్నీ వాసు పరిచయం అయ్యారని, సినిమా అవకాశాలు ఇస్తానని మాటిచ్చారని అంది.
అయితే , ఇప్పుడు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఈ విషయంలో అల్లు అరవింద్ స్పందించాలంటూ సునీత గళం విప్పింది. విషయం తెలుసుకున్న బంజారా హిల్స్ పోలీసులు సునీతని అదుపులోకి తీసుకున్నారు. సునీత ఇచ్చిన ఫిర్యాదుని పోలీసులు స్వీకరిస్తారా? బన్నీ వాసుని స్టేషన్కి పిలిపిస్తారా? అనే చర్చ సాగుతోంది.
ఇక మొన్నటి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె జనసేన పార్టీ తరఫున విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకించి- జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు ప్రముఖ నటుడు నాగబాబు పోటీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ స్థానంలో బోయ సునీత విస్తృతంగా ప్రచారం చేశారు.
వాటితోపాటు పవన్ కల్యాణ్ బరిలో నిలిచిన భీమవరం, గాజువాకల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాను మాత్రమే కాకుండా.. తనకు పరిచయం ఉన్న వారితో కూడా ఆమె జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశారని అంటున్నారు.