అన్నయ్య చిరంజీవికి ఓ పార్టీ రాజ్యసభ సీటు ఇవ్వబోతోందన్న ప్రచారానికి మెగా బ్రదర్ నాగబాబు ఫుల్స్టాప్ పెట్టేశారు. తన అన్నయ్య చిరంజీవి సినిమాలపైనే దృష్టి పెట్టారని, కళారంగానికే ఆయన జీవితం అంకితం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. చిరంజీవికి రాజ్యసభ సీటే కావాలంటే ఏ పార్టీ అయినా పిలిచి ఇస్తుందని నాగబాబు అన్నారు. కానీ అలాంటి కోరికలు ఏవీ చిరుకు ప్రస్తుతం లేవని తేల్చి చెప్పారు.
ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ కోసం రాజకీయాలను త్యాగం చేసినట్లు నాగబాబు వ్యాఖ్యానించడం గమనార్హం. రాజకీయాల్లో అన్నాదమ్ములు ఇద్దరు ఉండకూడదు, ఎవరో ఒక్కరే ఉండాలి అన్న ఉద్దేశ్యంతో చిరు రాజకీయాల నుండి తప్పుకుని పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు కోసం ఎప్పుడో నిర్ణయం తీసుకొని త్యాగం చేశారట. కళ్యాణ్ కు ఉన్న డెడికేషన్ వల్ల తన కన్నా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఉంటేనే చాలా బాగా చేయగలడని చిరు అనుకున్నారట. అందుకే తప్పుకుని సినిమా కెరీర్ పైనా దృష్టి పెట్టినట్లు నాగబాబు వివరించారు.
ఇక జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై కేవలం చిరు అభిప్రాయం చెప్పడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు నాగబాబు. చిరు మాటలను వక్రీకరించి చెప్పారని వివరణ ఇచ్చారు. ఇక రాజకీయాలకు సంబంధించి తను, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా పోరాడతారట. ఏది ఏమైనా తన అన్నయ్య చిరంజీవి జోలికి మాత్రం రావద్దని, ఆయనను రాజకీయాల్లోకి లాగొద్దని మాత్రం చాలా బాగా చెప్పారు నాగ బాబు.