నెల్లూరు రాజకీయ వారసులకు కష్టాలు

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఐదు కుటుంబాల వారసులకు పరీక్షా కాలం మొదలైంది. ఆరు దశాబ్దాలుగా నెల్లూరు జిల్లా నుంచి రాజకీయాలను శాసించిన ఆ కుటుంబాలకు 2019 ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి.

నెల్లూరు జిల్లా నుంచి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేనిది ఆనం కుటుంబం. ఒకే కుటుంబం నుంచి నలుగురు వ్యక్తులు మంత్రులుగా పనిచేశారు. ఆనం చెంచు సుబ్బారెడ్డి, ఆయన సోదరులు వెంకటరెడ్డి, సంజీవరరెడ్డి కూడా మంత్రులుగా పనిచేశారు. వెంకటరెడ్డి కుమారులు రాంనారాయణ రెడ్డి మంత్రిగా, వివేకానంద రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పతనంతో వీరి రాజకీయ జీవితం కూడా పతనమైంది. రాంనారాయణ రెడ్డి టీడీపీలోకి వచ్చినా అందులో ఇమడలేకపోయారు. ఇటీవల వివేకానందరెడ్డి మరణించారు. రాంనారాయణ రెడ్డి ప్రస్తుతం వైసీపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో దశాబ్దాలుగా రాజకీయాలలో చక్రం తిప్పిన ఆనం కుటుంబం పరిస్థితి దిక్కులేని నావలాగా మారింది.

ఇక సోఃమిరెడ్ది రాజగోపాల్ రెడ్డి పెద్దగా రాజకీయాల్లో రాణించలేకున్నా జిల్లాలో బలమైన నాయకునిగా ఎదిగాడు. ఆయన కుమారుడు సోమిరెడ్ది చంద్రమోహన్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ నుంచి మంత్రి స్థాయికి ఎదిగారు. 2019లో ఆయన సర్వేపల్లి నుంచే మంత్రి స్థాయిలో పోటిచేయనున్నారు. ఆయన గెలుపు అనివార్యమే అయినప్పటికీ ఈ ఎన్నికలు ఆయనకు జీవన్మరణ పోరాటంగానే చెప్పవచ్చు.

రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహారించింది నల్లపరెడ్డి కుటుంబం. ఈ కుటుంబం నుంచి వచ్చిన నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  జిల్లాపరిషత్ చైర్మన్ గా పనిచేశారు. 1983లో వెంకటగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయన సోదరుడు నల్లపరెడ్డి శ్రీనివాసులు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మరణంతో ఆయన కుమారుడు ప్రసన్నకుమార్ కు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ టీడీపీ తరపున టిక్కెట్ ఇవ్వగా ఆయన ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. 1999 లో కూడా టిడిపి నుంచి కొవ్వురు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటి చేసి ఓడిపోయారు. ప్రస్తుతం వైసిపిలో కొనసాగుతున్నారు.

ఇక ప్రత్యేక పరిచయం  అక్కర్లేదని నేదురుమల్లి కుటుంబం. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి సీఎంగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు. ఈయన భార్య రాజ్యలక్ష్మీ కూడా మంత్రిగా పనిచేశారు. వీరి కుమారుడు రాంకుమార్ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత వెంకయ్యనాయుడు ప్రభావంతో రాంకుమార్ బీజేపీలో చేరారు. అక్కడ ఇమడలేక వైసీపీలోకి వెళ్లారు. ప్రస్తుతం నేదురుమల్లి కుటుంబ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది.

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కాంగ్రెస్ లో బలమైన నాయకునిగా పేరున్న మాగంటి కుటుంబ పరిస్థితి కూడా అలాగే ఉంది. మాగంటి సుబ్బరామిరెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు హత్య  చేయబడ్డాడు. ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో సుబ్బరామిరెడ్డి భార్య  పార్వతమ్మ విజయం సాధించారు. సుబ్బరామిరెడ్డి సోదరుడు శ్రీనివాసులు రెడ్డి రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. 2014లో ఓటమి పాలు కావడంతో 2015లో టీడీపీ లో చేరి ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు.

ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో వెలుగు వెలిగిన నేతల వారసులందరికీ ఇప్పుడు రాజకీయ కష్టాలు వచ్చాయి. వారసత్వ సానుభూతి పనికొస్తుందనుకున్నా అది ఏమి పనిచేయకపోవటంతో వారంతా డైలమాలో పడ్డారు.  2019 ఎన్నికలు వారికి చావో రేవో అన్నట్టుగా సవాల్ గా మారాయి.