జనసేన విశాఖ ఎంపి అభ్యర్ది రెడీ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడే ఎన్నికలకు రెడీ అయ్యినంటున్నారు. తన జిల్లాల పర్యటనలోనే ఆయన 2019 ఎన్నికలకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే నేతల లిస్టు రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి నుంచే అభ్యర్థుల విషయంలో ఒక స్పష్టత వస్తే ఎన్నికల సమయానికి ఇబ్బందులు ఉండవని ఈ లోపు ఆ నేతలు కూడా పార్టీ బలోపేతానికి నియోజకవర్గంపై దృష్టి పెడుతారని జనసేనాని అభిప్రాయం. అందుకే ఆయన తన సైనికుల జాబితా రూపొందిస్తున్నారు. జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. కేవలం అధికారిక ప్రకటన మాత్రమే  మిగిలి ఉందని విశాఖ జనసేన నేతలు అంటున్నారు.

విశాఖ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి దాదాపు ఖరారు అయ్యింది. ఈ మధ్యనే పార్టీలో చేరిన బొలిశెట్టి సత్యనారాయణను ఎంపీగా బరిలోకి దింపటం ఖాయమైంది.విశాఖలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన బొలిశెట్టి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటి చేసి ఓడిపోయారు. టిడిపి, వైసిపి పార్టీలు.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి విశాఖ ఎంపీ టికెట్ ఇస్తాయని ప్రచారంలో ఉంది. దీంతో వారిని కొల్లగొట్టేందుకు జనసేన అధినేత వారి సామాజిక వర్గానికే చెందిన నేతకే టిక్కెట్ కేటాయించనున్నారని ప్రచారం జరుగుతుంది.

పర్యావరణవేత్తగా అమరావతి రాజధాని భూముల విషయంలో గ్రీన్ ట్రీబ్యునల్ లో కేసులు వేసి పోరాడుతున్న బొలిశెట్టికి సామాజిక ఉద్యమ నాయకునిగా మంచి పేరుంది. జనంలో కొంత పేరున్న లీడర్ గా ఆయనను ఎంపీగా పెడితే అర్ధబలంతో పాటు  అంగబలం కూడా సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. బొలిశెట్టి కాంగ్రెస్ నుంచి వచ్చినప్పుడే తన అనుచరులను కూడా పార్టీలో చేర్పించారు.

బొలిశెట్టి సత్యనారాయణ విశాఖ పార్లమెంట్ పరిధిలో విస్తృత పర్యటనలు చేస్తున్నాడు.ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికై అధికారుల వద్దకు కూడా వెళుతున్నాడు. పర్యవరణ  వేత్త కావడంతో చెట్ల పెంపకం, రైతులకు వ్యవసాయ రంగంలో మెలకువలు నేర్పించేందుకు గ్రామాలలో తిరుగుతూ రైతు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాడు. విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ కళాశాలల్లో కార్యక్రమాలు  నిర్వహిస్తున్నాడు. ఎంపీ టిక్కెట్ ఖరారు కావడంతో పవన్ సూచనల మేరకు బొలిశెట్టి సత్యనారాయణ విస్తృత పర్యటనలు చేస్తున్నాడని విశాఖ జనసేన నేతలు అంటున్నారు. విశాఖ ఒక్కటి మాత్రమే కాకుండా అన్ని జిల్లాల్లో పోటిచేసే అభ్యర్ధుల జాబితా దాదాపు సిద్దమైనట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. సామాజిక వేత్తలకు, మేధావులకు, యువత, మహిళలకు అధిక  ప్రాధాన్యం ఇచ్చి సీట్ల కేటాయింపు జరుగుతుందని జనసేన నాయకుడు ఒకరు తెలిపారు.