కరోనా దెబ్బ, ఎన్నికల్లో చెలరేగిన హింస ఇప్పుడు అధికార పార్టీ సహా అన్ని పార్టీల అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ఆరువారాల పాటు ఎన్నికలు వాయిదా పడటం వల్ల, తడిసిమోపెడు అవుతుందని, తమ జేబులకు చిల్లులు పడటం ఖాయమని వారంతా లబోదిబోమంటున్నారట.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాయిదా రాజకీయ ధుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే వాయిదాపై అధికార, విపక్షాల వాదనలు ఎలా ఉన్నా.. నష్టపోయేది తామే అంటూ అభ్యర్థులు ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకంటే.. ఎన్నికల్లో తమ గెలుపుకు కృషి చేసేది కార్యకర్తలే. ఏ ఎన్నికలు అయినా అన్నీ భుజాన వేసుకుని కష్టపడేది, నాయకులను గెలిపించేది వారే.. అలాంటి వారిని ఎన్నికల ముందు పక్కనే పెట్టుకుని పోషించడం చుక్కా, ముక్క వంటివి ఏర్పాటు చేయడం అభ్యర్థుల బాధ్యతగా తీసుకుంటారు. ఎన్నికలు అయ్యే వరకు వారు కోరిన కోరికలన్నీ తీరుస్తారు.
అయితే పాత షెడ్యూల్ ప్రకారం 15 రోజుల్లో ఎన్నికలు అయిపోయి ఉంటే అభ్యర్థులు పెద్దగా బాధపడేవారు కాదు. కానీ వాయిదా నేపథ్యంలో ఆరు వారాల పాటు కార్యకర్తలను కాపాడుకోవడమే వారికి పెద్ద భారంగా మారిపోయింది. అంత కాలం కార్యకర్తలు కోరిన విధంగా మద్యం, మాంసం ఇప్పించాల్సి రావడం.. అలాగే కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడు ఎవరూ చికెన్ వద్దని, మటన్ కావాలని కోరుతున్నారట. కొండెక్కి కూర్చున్న మటన్, చేపలు వంటివి అంత కాలం ఇస్తే ఆరిపోవడం ఖాయం అని వాపోతున్నారు.
ముఖ్యంగా కోస్తా జిల్లాలు, రాయలసీమల్లో గ్రూపు రాజకీయాలు ఎక్కువ. కాబట్టి అక్కడ కార్యకర్తల పోరాటం సహజంగానే కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి అన్ని సదుపాయాలు కల్పించాల్సింది అభ్యర్థులే. మిగిలిన జిల్లాల్లోనూ చాలా వరకు ఇదే పరిస్థితి కాబట్టి
ఎన్నికలు జరగాల్సిన చోట కార్యకర్తలకు పండుగలా ఉంటే అభ్యర్థుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.