ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగానే ఉన్నా.. విదేశాల నుండి వచ్చిన వారు, ఇతర ప్రాంతాల్లో ప్రయాణించి వచ్చిన వారి సంఖ్య మాత్రం భారీగానే ఉంది. అందుకే ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, స్వీయ నియంత్రణ లేకున్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నది ప్రభుత్వం ప్రతి రోజూ చెప్తున్నదే.
కానీ ప్రభుత్వం మాటలను ఏ ఒక్కరూ పట్టించుకుంటున్నట్లు కనబడటం లేదు. ప్రయాణాలు చేసి వచ్చిన తర్వాత కూడా స్వీయ నిర్బంధం వంటివి పాటించకుండా విందులు, వినోదాల్లో పాల్గొనడం, అలాగే బంధువులను కలవడం వంటివి చేస్తున్నారు. అలాంటి ఫలితమే.. తాజాగా కరోనావైరస్ సోకిందన్న అనుమానంతో గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను అధికారులు ఐసోలేషన్కి తరలించినట్లు తెలుస్తోంది.
విశయం ఏమిటంటే.. ఇటీవలే ఎమ్మెల్యే బంధువు ఒకరు ఢిల్లీ వెళ్లి వచ్చారట. అనంతరం వారి ఇంట్లో ఓ విందు ఇచ్చారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూడా పాల్గొనడం.. అనంతరం ఆ బంధువు భార్యకు కరోనా పాజిటివ్ అని తేలిందట. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు కూడా వైరస్ సోకిందేమో అన్న అనుమానంతో ఐసోలేషన్ సెంటర్కు తరలించినట్లు టాక్. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏంటి అన్నది తెలియకపోయినా.. జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం కరోనాకు గురికావాల్సి వస్తుందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.