తెలంగాణలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలంటే, ఏపీలో కూడా ఆ మాత్రం సందడి వుంటుంది మరి.!
భారత్ రాష్ట్ర సమితిగా మారిన ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి.. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతుందన్నది నిర్వివాదాంశం.
తెలంగాణలో బీజేపీ – జనసేన మధ్య సంబంధాల్లేవు. దీన్ని ఆసరగా తీసుకుని, జనసేన నుంచి కొంత మద్దతును ఆశిస్తోంది గులాబీ పార్టీ.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, జనసేన కూడా గులాబీ పార్టీతో చేతులు కలపడానికి సిద్ధమవుతోంది. అందుకు ప్రతిగా తమకు కొన్ని సీట్లు ఇవ్వాలని జనసేన కోరుతోందట.
ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు కనీసం తమ పార్టీ నుంచి గెలిచేలా, కొన్ని స్థానిక పదవులు తమకు దక్కేలా జనసేనాని మంతనాలు జరుపుతున్నారంటూ ఓ ప్రచారం తెరపైకొచ్చింది.
ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ‘వై నాట్ 175’ అనే నినాదం వైసీపీ భుజానికెత్తుకున్నా, కింది స్థాయిలో పరిస్థితులు భిన్నంగా వున్నాయ్.
‘టీడీపీని పూర్తిగా మట్టుబెట్టేయడమే’ వైసీపీ ముందున్న లక్ష్యం. జనసేన వల్ల టీడీపీకి ఏమాత్రం ఆక్సిజన్ అందకూడదని వైసీపీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో మద్యవర్తుల ద్వారా జనసేన – వైసీపీ మధ్య బ్రిడ్జి కోసం వైసీపీ నుంచి ప్రయత్నాలు షురూ అయ్యాయట.
దానికి గులాబీ బాస్ కేసీయార్ కూడా తనవంతు సహకరిస్తున్నారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.