ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు కేసీయార్ మెడకు చుట్టుకుంటుందా.?

 తెలంగాణలో ఫామ్ హౌస్ వేదికగా ఎమ్మెల్యేల కొనుగోళ్ళ యత్నానికి సంబంధించిన కేసులో ఎప్పటికప్పుడు సరికొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

 వీడియోలు ఈ కేసులో కీలక సాక్ష్యాలు అయితే, వాటిని ముఖ్యమంత్రికి ఎలా ఇచ్చారంటూ హైకోర్టు, తెలంగాణ పోలీసులపై మండిపడిన సంగతి తెలిసిందే.

 కేసు విచారణను సీబీఐకి అప్పగించింది తెలంగాణ ఉన్నత న్యాయస్థానం.అయితే, సీబీఐ విచారణను అడ్డుకునేందుకు తెలంగాణలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 తెలంగాణ సిట్ నుంచి కేసు గనుక పూర్తిగా చేజారిపోయి, అది సీబీఐ చేతిలో పడితే అంతే సంగతులు.! ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుని సీబీఐ విచారిస్తోంది.

 ఏళ్ళు గడుస్తున్నాయ్.. కేసులో ఇంతవరకు ఎలాంటి ముందడుగూ పడిన దాఖలాల్లేవు. అంతర్వేది రథం దగ్ధం కేసు, సుగాలి ప్రీతి హత్య కేసు.. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే వుంటాయ్.

 అయినా, తెలంగాణ సిట్ ఏమైనా ఉద్ధరించిందా.? అంటే అదీ లేదాయె. అలాంటప్పుడు, ఈ కేసు సీబీఐకి అప్పగిస్తే వచ్చే లాభమేంటి.? అన్న చర్చ కూడా జరుగుతోంది.

 ఎవరి గోల వారిదే. ‘సిట్’ విచారిస్తే, బీజేపీకి వ్యతిరేకంగా విచారణలు జరుగుతాయ్. అదే సీబీఐకి కేసు వెళితే.. తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా పరిణామాలు మారతాయ్.

 కొత్త సంవత్సరంలో అనూహ్యమైన పరిణామాలైతే చోటు చేసుకోవచ్చు. సీబీఐ రంగంలోకి దిగితే గనుక, ఆ విచారణను ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి నానా తంటాలూ పడాల్సి రావొచ్చు.

 అన్నట్టు, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం బీఆర్ఎస్.. అదేనండీ భారత్ రాష్ట్ర సమితిగా మారింది కదా.!

 ఔను, అలా భారత్ రాష్ట్ర సమితి అవుతోందనే కదా, ఈ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ కుంపటి తెరపైకొచ్చింది.?