ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం.! కానీ, ఎందుకు ధర్మాన.?

 వైసీపీ ప్రభుత్వాన్ని బహుశా నిండా ముంచెయ్యాలనే అనుకుంటున్నట్టున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. లేకపోతే, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రమంటూ వింత వాదనను తెరపైకి తీసుకురావడమేంటి.?

 ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా మారితే, దానికి ముఖ్యమంత్రి అయిపోదామనే ఆలోచన ఏమైనా ధర్మాన చేస్తున్నారేమో.!

 ఉత్తరాంధ్ర గురించి గట్టిగా మాట్లాడుతున్న వైసీపీ నేతల్లో మొదట బొత్స సత్యనారాయణ, ఆ తర్వాత ధర్మాన ప్రసాదరావు కనిపిస్తారు. ఆ తర్వాతి స్థానం స్పీకర్ తమ్మినేని సీతారామ్‌దే.

 ఈ ముగ్గురూ వైసీపీలో కీలక నేతలు. ఇద్దరేమో మంత్రులు.! ధర్మాన, బొత్స, తమ్మినేని.. ఈ ముగ్గురికీ రాజకీయాలు కొత్త కాదు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో వున్నారు.

 మంత్రి పదవులు అనుభవించారు, అనుభవిస్తున్నారు. మరి, వీరి హయాంలో ఉత్తరాంధ్ర ఎందుకు వెనుకబాటుతనం నుంచి బయట పడలేకపోయింది.?

 ఏ ప్రాంతం వెనుకబాటుతనానికి గురైనా, దానికి మొదటగా బాధ్యత వహించాల్సింది ఆ ప్రాంత నాయకులే. తమ్మినేని కావొచ్చు, ధర్మాన కావొచ్చు, బొత్స కావొచ్చు..

 రాజకీయాల్లో చక్రం తిప్పారు, తిప్పుతూనే వున్నారు. కానీ, ఉత్తరాంధ్ర బాగోగుల్ని ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని అనొచ్చేమో.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఆ కారణంగానే, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది.

 మళ్ళీ ఈ విభజన గోలేంటి.? విశాఖ రాజధాని కావాలని కోరుకోవడంలో తప్పే లేదు. అలా కుదరకపోతే, విభజించాలనడం ముమ్మాటికీ తప్పే.!

 వైఎస్ జగన్ ప్రోత్సాహంతోనే వీరంతా ఇలా మాట్లాడుతున్నారా.?