రోజురోజుకు నకిలీ వస్తువుల సమస్య ప్రమాదకరంగా మారుతోంది.ప్రస్తుత మార్కెట్లో ఏది మంచి వస్తువు ఏది నకిలీ వస్తువు కనిపెట్టడం చాలా కష్టంగా మారింది.
చివరకు మనం తినే ఆహారం విషయంలో కూడా కల్తీ ఆహారాన్ని తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు కొందరు కేటుగాళ్లు.
చివరకు నీళ్లను కూడా కల్తీ తయారు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పనక్కర్లేదు. కల్తీ ఆహారం కారణంగా ఏటా కొన్ని లక్షల మంది అనారోగ్యానికి గురవుతున్నారు.
వీటి విషయంలో జాగ్రత్త వహించకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.చివరకు ప్రకృతి సిద్ధంగా లభించే తేనెను కూడా కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని తలపెడుతున్నారు.
తేనెలో యాంటీ మైక్రోబియన్ గుణాలు సహజ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభించి మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అయితే మనకు తెలియకుండా తీసుకునే కల్తీ తేనె వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ తేనెను గుర్తించే విషయంలో ప్రజలు కొంత అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉండాలి.
కల్తీ తేనెను ఎలా గుర్తించాలో కొన్ని సూచనల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గాజు గ్లాసులో నీళ్లను తీసుకొని అందులో తేనెను రెండు చుక్కలు వేస్తే ఆ తేనె కరిగిపోకుండా గ్లాసు అడుగు భాగానికి చేరితే అది స్వచ్ఛమైన తేనెగా గుర్తించవచ్చు.
అదే నకిలీ తేనె అయితే నీటిలోకి వేయగానే కరిగిపోతుంది. స్వచ్ఛమైన తేనె పారదర్శకంగాను, తక్కువ జిగట స్వభావం కలిగి ఉంటుంది. నకిలితేనే ముదురు రంగు ఎక్కువ జిగట స్వభావం కలిగి ఉంటుంది.
స్వచ్ఛమైన తేనె దుస్తులపై పడితే మరక అంటదు. స్వచ్ఛమైన తేనెను కళ్లకు రాసుకుంటే కొంత మంటగా ఉంటుంది. స్వచ్ఛమైన తేనె రుచి మరీ తీయగా కాకుండా కొంత వగరుగా ఉంటుంది.
అలాగే మంచి సువాసన కూడా కలిగి ఉంటుంది.ఇలా కొన్ని సూచనల ద్వారా కల్తీ తేనెను గుర్తించవచ్చు