టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. నాయకులు పార్టీ మారడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కొంతమంది పార్టీ మారారు..
అద్భుతం.. శని వదిలిపోయింది.. పార్టీకి నష్టమేం లేదు..’ అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలిప్పుడు వైరల్ అవుతున్నాయి.
రాజకీయాల్లో నాయకులు పార్టీలు మార్చడం అనేది సర్వసాధారణం. ఎక్కడిదాకానో ఎందుకు, నారా లోకేష్ తండ్రి నారా చంద్రబాబునాయుడు చేసిందేంటి.?
కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి కదా ఆయన దూకింది.. స్వర్గీయ ఎన్టీయార్‌ని వెన్నుపోటు రాజకీయాలతో దించేసి, టీడీపీ గద్దెనెక్కింది.?
టీడీపీలో ఇప్పుడున్న చాలామంది నాయకులు ఇతర పార్టీల్లోంచి వచ్చినవాళ్ళే. టీడీపీలోకి ఎవరైనా వస్తే అహో.. అద్భుతం.!
టీడీపీ నుంచి ఎవరైనా వెళ్ళిపోయినా.. అద్భుతమే.. కాకపోతే, శని వదిలిపోతుందన్నమాట.!
ఇవిగో.. ఇలాంటి రాజకీయాలే టీడీపీ కొంప ముంచేస్తాయ్. మొదటి రోజు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా, ఆయన నోట చాలా తప్పులు దొర్లేశాయ్.
కానీ, టీడీపీ అనుకూల మీడియా.. లోకేష్‌ని ప్రశంసల్లో ముంచెత్తేసింది.. ఆయన్ని భుజానికెత్తుకుని ఊరేగుతోంది.
సరే, రాజకీయాల్లో మాట దొర్లడం అనేది పెద్ద విషయమేమీ కాదనుకోండి.. అది వేరే విషయం. కానీ, నాయకులు పార్టీలు మారడమంటే.. శని వదిలిపోయిందన్నట్టుగా
లోకేష్ వ్యాఖ్యానించడం అస్సలు చిన్న విషయం కాదు. పార్టీ మారిన నాయకుల విషయంలో లోకేష్ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.