వైసీపీ ప్రభుత్వ ట్యాబ్‌లపై టీడీపీ సిల్లీ కామెంట్స్.!

విద్యాబోధనలో డిజిటలైజేషన్ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది.

బైజూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని, ప్రభుత్వ స్కూళ్ళలోని విద్యార్థులకు డిజిటల్ స్టడీ మెటీరియల్ అందించడానికి సర్వం సిద్ధం చేసింది.

ట్యాబ్‌ల కోనుగోలు కోసం సుమారు 600 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఐదు లక్షలకు పైగా ట్యాబ్‌లు విద్యార్థులకు అందిస్తోంది వైసీపీ ప్రభుత్వం.

నిజానికి, ఇలాంటి ఆలోచనల్ని ఎవరైనా స్వాగతించాల్సిందే. రాజకీయాలు తర్వాత.. ముందైతే, విద్యార్థులకు మెరుగైన విద్య అందుతున్నందుకు ఆనందించాలి కదా.?కానీ, అలా ఆనందిస్తే, అది విపక్షం ఎందుకు అవుతుంది.?

తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి మీడియా ముందుకొచ్చేశారు. ట్యాబ్‌ల కొనుగోళ్ళలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్నారు.

అమెజాన్ ద్వారా ట్యాబ్‌లు కొనుగోలు చేస్తే, సుమారు ఒక్కో ట్యాబ్ మీదా 1200 రూపాయలు తగ్గుతుందనీ, బల్క్ కొనుగోళ్ళ నేపథ్యంలో మూడు వేల నుంచి నాలుగు వేలు కూడా తగ్గే అవకాశం వుందనీ అంటున్నారు పట్టాభి.

ట్యాబ్‌ల కొనుగోళ్ళలో అవినీతి జరిగిందన్నది టీడీపీ నేత పట్టాభి ఆరోపణ. అంత గట్టిగా నమ్ముతున్నప్పుడు, ఈ విషయమై టీడీపీ కోర్టుకు వెళ్ళొచ్చు కదా.? ఏమో, వెళుతుందేమో కూడా.!

అయినా, నిర్ణయాలు తీసుకునే సమయం.. ఒప్పందాలు కుదిరే సమయం.. కొనుగోళ్ళ సమయం.. వీటి ప్రకారం ధరలు వుంటాయని తెలియకపోతే ఎలా.?

ఆన్‌లైన్‌లో కొనుగోళ్ళు చేస్తే ఆ ప్రోడక్ట్స్ క్వాలిటీ ఏంటన్నది జగమెరిగిన సత్యం. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ధరలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయ్.

ప్రభుత్వం అన్ని విషయాల్నీ పరిగణనలోకి తీసుకుని, తక్కువ ధరకే ట్యాబ్‌లను కొనుగోలు చేసినా, ఆ తర్వాత వాటి ధర తగ్గితే ప్రభుత్వం మాత్రం ఏం చేయగలుగుతుంది.?

కుంభకోణం.. అంటూ ఆరోపణలు చేస్తే సరిపోదు, ఆధారాలు చూపించి న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తే రాష్ట్ర ఖజానాకీ మేలు జరుగుతుంది కదా.?