‘ఔను, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను..’ అంటూ సినీ నటుడు నందమూరి తారకరత్న ఇప్పటికే ప్రకటించేశాడు.
ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది మావయ్య నారా చంద్రబాబునాయుడు డిసైడ్ చేస్తారని కూడా చెప్పుకొచ్చాడాయన.
సినిమాల్లో ఛాన్సులు పెద్దగా లేవ్. ఆ మధ్య ఓ వెబ్ సిరీస్ చేశాడు. దాంతో, తారకరత్న నటనా కెరీర్ పెద్దగా పస లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగినట్లు కనిపిస్తోంది. గడ్డం పెంచేసి, మాస్ పొలిటీషియన్ అనిపించుకోవాలనే తపన తారకరత్నలో కనిపిస్తోంది.
తాజాగా గుంటూరు జిల్లాలో పర్యటించిన తారకరత్న, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు సూచన, సలహా మేరకే తారకరత్న ఏపీ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాడట.
గుడివాడలో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారు.? అన్నదానిపై ఎప్పటికప్పుడు సరికొత్త పేర్లు తెరపైకొస్తున్నాయి.
ఆ మధ్య కాంగ్రెస్ నేత, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి పేరు కూడా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి, టీడీపీలో చేరతారా.? అంటే, అది అనుమానమే.
తారకరత్న మాత్రం గుడివాడ నియోజకవర్గంపై ఆసక్తితోనే వున్నాడట. త్వరలో ఆయన జూనియర్ ఎన్టీయార్‌తో భేటీ అయి, గుడివాడలో పోటీ చేసే విషయమై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కానీ, గుడివాడలో కొడాలి నానిని ఢీకొనడం తారకరత్నకి సాధ్యమయ్యే పనేనా.?